త్రిభాష.. డిలిమిటేషన్ పై పవన్ క్లియర్ కట్ అభిప్రాయాలు ఇవే

కేంద్రం హిందీని తమ మీద రుద్దుతుందన్న ఆరోపణ ఒకవైపు.. మరోవైపు పార్లమెంట్ స్థానాల పునర్విభజన అంశం హాట్ హాట్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-03-24 04:01 GMT

కేంద్రం హిందీని తమ మీద రుద్దుతుందన్న ఆరోపణ ఒకవైపు.. మరోవైపు పార్లమెంట్ స్థానాల పునర్విభజన అంశం హాట్ హాట్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాదిన పలు రాష్ట్రాలతో పాటు.. ఉత్తరాదికి చెందిన కొన్ని పార్టీలు స్టాలిన్ వాదనకు మద్దతు తెలిపిన వైనం ఇప్పటికే చోటు చేసుకుంది. అదే సమయంలో ఈ ఇష్యూకు దూరంగా ఉంటోంది ఏపీలో కూటమి సర్కారు. అధికార పార్టీకి చెందిన మూడు పార్టీలు ఈ అంశంపై మాట్లాడని పరిస్థితి. ఇప్పటికే ఈ అంశాలపై మీ స్టాండ్ ఏమిటంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పలువురు ప్రశ్నిస్తున్నారు.

సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేశారు ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్. తమిళనాడులో ప్రముఖ చానళ్లలో ఒకటైన ‘తంతి’ టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన వాదన.. అంచనాలతో పాటు.. వివాదాస్పద అంశాలపైనా సూటిగా.. సుత్తి కొట్టని రీతిలో సమాధానాలు ఇచ్చేయటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలపై అడిగిన ప్రశ్నలకు తప్పించుకునే ప్రయత్నం చేయకుండా.. తన అభిప్రాయాల్ని చెప్పిన తీరు ఆసక్తికరంగా మారింది.

ఇంటర్వ్యూలో పవన్ ఏం చెప్పారు? అందులోని ముఖ్యాంశాల్ని చూస్తే..

- త్రిభాషా విధానంలో హిందీని మాత్రమే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదు. భాషను బలవంతంగా రుద్దడాన్ని నేను వ్యతిరేకిస్తా.

- జనసేన వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తన ప్రసంగంలో ప్రముఖ తమిళ కవి భారతీయార్ కవితతో ప్రారంభించటం.. ప్రసంగంలో అక్కడక్కడా తమిళం ఉండటం వెనుక గతం ఉంది. టీనేజ్ లో ఉన్నప్పుడు జీవితం గురించి భయం కలిగింది. దాని గురించి అన్వేషించా. అప్పుడే అచమిల్లై.. అచ్చమిల్లై (భయం లేదు భయం లేదు) అనే భారతీయార్ కవిత కనిపించింది. అవి నాకు ధైర్యం ఇచ్చిన పదాలు.

- 2014లో పార్టీని ప్రారంభించిన సమయంలో కనుచూపు మేర చీకటే కనిపించింది. ఎలా ముందుకు వెళ్లాలో తెలియలేదు. మనసులో ఉన్న ధైర్యం తప్ప మరేమీ లేదు.

- ప్రతి భాషకూ గౌరవం ఇవ్వాలి. భాషా సంస్క్రుతులను గౌరవించటం నాకున్న ఏడు మార్గదర్శకాల్లో ఒకటి. పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో భాషా విధానం గురించి చేసిన ప్రసంగంలో తప్పేముంది?

- ఆంధ్రప్రదేశ్ లో 30 తమిళ.. 107 ఒరియా.. 57 కన్నడ.. 5 సంస్క్రత.. 400 ఉర్దూ.. 37 వేలకు పైగా తెలుగు స్కూళ్లు ఉన్నాయి. వీటి ఉద్దేశం మాతృభాషలో బేసిక్ ఫౌండేషన్ ను సులువుగా అర్థం చేసుకోవటమే.

- ఏ భాషను బలవంతంగా రుద్దకూడదు. అలావాటిని నేనూ వ్యతిరేకిస్తా. తమిళం నేర్చుకోవాలని నన్ను ఎవరూ ఒత్తిడి చేయలేదు. నేనే నేర్చుకున్నా.

- త్రిభాషా విధానంలో హిందీనే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదు. అందులో ఐచ్ఛికాలు ఉన్నాయి. నేను త్రిభాషా విధానంలో రూపొందిన వాడిని. ఆంగ్లం.. తెలుగు.. హిందీ తెలుసు. దీని వల్ల నాకు మేలు జరిగింది. హిందీని నేర్చుకొని తెలుగుకు దూరం కాలేదు. ఆ మాటకు వస్తే మరింత దగ్గరయ్యా. ఎక్కడో బ్రిటిషువారి ఆంగ్లాన్ని నేర్చుకోవటానికి లేని భయం హిందీని నేర్చుకునేందుకు ఎందుకు?

- ఉత్తరాది రాష్ట్రాల్లో పలు భాషలు హిందీతో కనుమరుగయ్యాయన్న వాదనలో నిజం లేదు. పలువురు డీఎంకే నేతలు హిందీ మాట్లాడుతున్నారు. తమిళనాడు.. ఆంధ్రా నేతలు పలువురు హిందీ మాట్లాడుతున్నా బహిరంగంగా హిందీని వ్యతిరేకిస్తున్నారు. త్రిభాషా విధానాన్ని రుద్దినట్లుగా చూడలేదు. పలు భాషలు నేర్చుకునేందుకు అవకాశంగా భావిస్తున్నా.

- త్రిభాషా విధానం ఆంధ్రప్రదేశ్.. కర్ణాటకలో సహజం. ఈ విధానాన్ని ప్రభుత్వం అదనపు వ్యయం అని ఎందుకు భావించాలి? ఇది అదనపు ఉద్యోగ అవకాశాలనూ కల్పించేదిగా చూడొచ్చు కదా?

- లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు ఉందంటూ చెన్నైలో జరిగిన ఉమ్మడి కార్యాచరణ సమితి సమావేశానికి ముందు పార్లమెంటులో మాట్లాడాలి. ఆ తర్వాత పోరాడాలి. అలా కాకుండా ఒకేసారి రోడ్లపైకి వస్తే ఎలా? ఒకవేళ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం లేకపోతే ఈ వైఖరి మరోలా ఉండేది. లోక్ సభలో ప్రాతినిధ్యం తగ్గడాన్ని నేనూ అంగీకరించను.

- నియోజకవర్గాల పునర్విభజనతో పార్లమెంట్ లో ప్రాతినిధ్యం తగ్గదని బలంగా నమ్ముతున్నా. ఆంధ్రప్రదేశ్ ను దాటి జనసేనను తమిళనాడులో విస్తరించాలన్న ఆలోచన లేదు. రాజకీయాల్లో ఏమైనా జరుగుతుంది. కాంగ్రెస్ ను దక్షిణాదిలో అన్నాదురై ఓడించటమే దీనికి నిదర్శనం. రాజకీయాల్లో నేను సాధించిన దానికి అన్నయ్య చిరంజీవి గర్విస్తున్నారు.

Tags:    

Similar News