జనసేనలో అసంతృప్తి.. గ్రౌండ్ లెవిల్‌లో గడబిడ!
ఏపీలో కూటమి కట్టి వైసీపీని అధికారంలోకి రాకుండా చేసిన జనసేన పార్టీ.. ప్రస్తుతం పాలనలో కీలక భూమిక పోషిస్తున్న విషయం తెలిసిందే.;
ఏపీలో కూటమి కట్టి వైసీపీని అధికారంలోకి రాకుండా చేసిన జనసేన పార్టీ.. ప్రస్తుతం పాలనలో కీలక భూమిక పోషిస్తున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లు మంత్రులుగా వున్నారు. ఇతర 21 మంది ఎమ్మెల్యేల్లో 18 మంది సాధారణ ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. పది నెలలు గడిచిపోయన నేపథ్యంలో తాజాగా వారి బాధలు పార్టీకి విన్నవించుకున్నారు.
నియోజకవర్గాల్లో తమ మాటకు విలువ లేకుండా పోయిందని జనసేన మెజారిటీ ఎమ్మెల్యేలు ముక్త కం ఠంతో చెప్పడం గమనార్హం. అంతేకాదు.. టీడీపీ నాయకులు తమను ఓవర్ టేక్ చేసేస్తున్నారని.. తాము చిన్న పనిచెప్పినా.. కలెక్టర్ నుంచి బిల్లు కలెక్టర్ వరకు ఎవరూ లెక్క చేయడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. అధికారుల బదిలీల విషయంలో అసలు తమ మాటకే విలువ లేకుండా పోయిందని.. కాంట్రాక్టుల నుంచి నిధుల వ్యవహారం వరకు తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు.
తాజాగా సోమవారం రాత్రి విజయవాడలోని ఓ హోటల్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన 18 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. కలెక్టర్ల సదస్సు ఉన్న నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సమస్యలు చెప్పాలని ఆయన కోరారు. అయితే.. అసలు తమను పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు.. ఇక, తాము ఏం చెబుతామని.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మత్స్య కార సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
ఇదే మాటను ఉత్తరాంధ్రకు చెందిన బలమైన నాయకుడు ఒకరు చెప్పారు. మొత్తానికి గ్రౌండ్ స్థాయిలో జనసేన ఎమ్మెల్యేల పరిస్థితి అయితే ఇబ్బందిగానే ఉందని తేల్చి చెప్పారు. దీనిని అధిష్టానానికి చేరవేస్తానని.. నాదెండ్ల మనోహర్ వారికి భరోసా ఇచ్చారు. అయితే.. వాస్తవానికి ఎమ్మెల్యేల మాట ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల మిలాఖత్ అయిన నాయకులు కూడా ఉన్నారు. మరికొన్ని చోట్ల వివాదాలకు తెరదీసిన నాయకులు కూడా ఉన్నారు. ఈ సమస్య పరిష్కారం అంత తేలికేమీ కాదని పరిశీలకులు చెబుతున్నారు.