ధన్యవాదాలండీ ప్రభుత్వం వారూ...బాబుకి అరుదైన ప్రశంస !

ప్రస్తుతం అలాంటి అరుదైన ప్రశంస చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి లభించింది.;

Update: 2025-03-25 13:24 GMT

సాధారణంగా ప్రభుత్వంలో ఉన్న వారిని అందులో పనిచేస్తున్న వారు పొగడరు. ఎందుకంటే ఎంత చేసినా ఎక్కడో ఒకచోట అసంతృప్తి ఉంటుంది. కానీ అవధులు మించిన మేలు జరిగింది అన్న భావన వారిలో కలిగినపుడు లేదా తాము కలలో సైతం ఊహించనిది ఇలలో నెరవేర్చారు అన్న హర్షామోదం సంభవించినపుడు మాత్రమే అన్నింటికీ అతీతంగా వారి నుంచి మెచ్చుకోలు మాటలు వస్తాయి.

ప్రస్తుతం అలాంటి అరుదైన ప్రశంస చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి లభించింది. తొమ్మిది నెలలలో ఈ ప్రభుత్వం ఏమి చేసింది అంటే చాలానే అని పార్టీలు చెప్పాల్సింది లేదు. ఇలా జనాలు ఓపెన్ అయి చెబితే చాలు కదా అని అంటున్నారు. ఇంతకీ ఈ ముచ్చట ఏమిటి అంటే చాలానే అని చెప్పాలి.

ప్రభుత్వ ఉద్యోగులు పొదుపు పేరుతో దాచుకున్న పీఎఫ్ సొమ్ముని గత వైసీపీ ప్రభుత్వం యధేచ్చగా వాడుకుంది. దాంతోనే వారికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అవసరం అయినపుడు తీసుకోవడానికే పీఎఫ్ ఉందని మాత్రమే తమకు తెలుసు అని వారు అంటున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే భద్రత అనుకున్నామని కానీ వైసీపీ అయిదేళ్ళ పాలనలో మాత్రం తమ డబ్బుకు భద్రత లేకపోగా అవసరం అయినపుడు తీసుకోవడానికి కూడా వీలు లేకపోయింది అని వారు వాపోయిన సంఘటనలు ఎన్నో.

ఈ విషయాలనే ఇపుడు ఫేస్ బుక్ వేదికగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాఘవ రామిరెడ్డి రాసిన బహిరంగ లేఖ సోషల్ మీడియాలో తేగ వైరల్ అవుతోంది. ఆ లేఖలో ఆయన వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకంతో పాటు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక తమకు కలిగిన లబ్దిని గురించి పూర్తిగా వివరించారు. కృతజ్ఞతలు ప్రభుత్వం వారూ అంటూ మొదలెట్టి చాలా సంగతులే అందులో ప్రస్తావించారు.

“ప్రతి నెలా, మేము మా జీతంలో కొంత మొత్తాన్ని యజమాని వద్ద అంటే ప్రభుత్వం వద్ద ఉంచుతాము. ఆ పొదుపులు మా పదవీ విరమణ తర్వాత, మా పిల్లల చదువు, పిల్లల వివాహం, అత్యవసర వైద్య ఖర్చులను భరించడం లేదా కొత్త ఇల్లు కొనడం లేదా నిర్మించడం కోసం ఉపయోగపడతాయనే ఆశతో మేము దీన్ని చేస్తాము. ప్రభుత్వంపై మేము పూర్తి నమ్మకంతో మరియు నమ్మకంతో దీన్ని చేస్తాము. సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం మా నమ్మకాన్ని వమ్ము చేయలేదు, ”అని సదరు ప్రధాన ఉపాధ్యాయుడు తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాశారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం తన పదవీకాలంలో ప్రభుత్వ ఉద్యోగులను ఎలా ఇబ్బంది పెట్టిందో కూడా సోదాహరణంగా రామిరెడ్డి వెల్లడించారు. "మీకు ముందు మమ్మల్ని పరిపాలించిన వారు అక్షరాలా మమ్మల్ని ఏడిపించారు అని ఆయన తన మనసులో బాధను కుండబద్ధలు కొట్టారు. . ప్రభుత్వంతో మేము ఆదా చేసిన డబ్బు మాకు అవసరమైనప్పుడల్లా, మా కష్ట సమయాల్లో అది మాకు చేరలేదు. చివరికి వారు మా పొదుపు డబ్బును కూడా వారి ఖర్చులకు ఉపయోగించుకున్నారని మాకు తెలిసింది," అని ఆయన అన్నారు.

తన స్నేహితుడు తాను దాచుకున్న పీఎఫ్ డబ్బు కోసం పదే పదే చేసిన విన్నపాలు కూడా మన్నించనపుడు తన కుమార్తె వివాహం కోసం అధిక వడ్డీకి రుణం తీసుకోవలసి వచ్చిందని ఆయన అందులో రాశారు. ఆ రోజు అతని కళ్ళలో చాలా బాధ కనిపించింది, ”అని ఆయన అన్నారు.

ఇక ఇపుడు చూస్తే చంద్రబాబు సర్కార్ ప్రతి నెల 5వ తేదీన వాయిదాలలో క్రమంగా వారి డబ్బును చెల్లించడం ద్వారా తనను ఎలా ఆశ్చర్యపరిచారో రాశారు, “వారు వెళ్లిపోయారు, మీరు వచ్చారు. మునుపటి ప్రభుత్వం మా కష్టార్జిత పొదుపు మొత్తాన్ని దోచుకున్నప్పుడు కొత్త ప్రభుత్వం మా జీతాలను ఎలా చెల్లిస్తుందో మేమందరం ఆశ్చర్యపోయామని ఆయన అనాందంతో తన అనుభూతులను పంచుకున్నారు.

అంతే కాదు మీరు పనిమనిషి, వాచ్‌మెన్, మధ్యాహ్న భోజన కార్మికుల జీతాల బకాయిలు, ఉద్యోగులు తీసుకున్న రుణాల బకాయిలు విద్యార్థుల ఫీజుల బకాయిలను చెల్లిస్తున్నారు” అని ఆయన కొనియాడారు. ఇక చివరిలో ఆయన వేసిన పంచులు అదుర్స్ అన్నట్లుగా ఉన్నాయి.

ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇంత చేసినా బాబు ప్రభుత్వం వారి మంచి పనులను సరిగ్గా ప్రచారం చేసుకోవడం లేదని ఆయన అనడం విశేషం. అదే గత ప్రభుత్వం అయితే వారు కొన్ని వందల కోట్లు విడుదల చేసినా, వారు ప్రకటనలు ప్రసంగాల ద్వారా బ్రహ్మాండమైన ప్రకటనలతో హడావుడి చేసేవారు అని ఆయన ఒక పోలిక తెచ్చి బాబు మంచి పనులకు ప్రచారం జరగాలని కోరుకున్నారు . మొత్తానికి బాబు సర్కార్ కి ఈ బహిరంగ లేఖ ఒక ప్రశాంసాపూర్వకమైన సత్కారం కాదా అని అంతా అంటున్నారు.

Tags:    

Similar News