మాధవి హత్య కేసు: డీఎన్ఏ రిపోర్టులో సంచలన విషయాలు
ఈ కేసులో పోలీసులు సేకరించిన నమూనాల డీఎన్‌ఏ రిపోర్ట్ తాజాగా వారికి అందింది.;
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట మాధవి హత్య కేసులో కీలక పురోగతి లభించింది. ఈ కేసులో పోలీసులు సేకరించిన నమూనాల డీఎన్‌ఏ రిపోర్ట్ తాజాగా వారికి అందింది. భార్య మాధవిని అత్యంత దారుణంగా హత్య చేసి, ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి, ఉడకబెట్టి, ఎముకలను పొడి చేసి చెరువులో పడేసిన భర్త గురుమూర్తి నేరం రుజువైంది.
సంక్రాంతి పండుగ రోజున జరిగిన ఈ హత్య కేసులో గురుమూర్తి ఎలాంటి ఆధారాలు లేకుండా చేయాలని ప్రయత్నించాడు. అయితే, పోలీసులు ఇంట్లో సేకరించిన టిష్యూస్ అతడిని పట్టించాయి. క్లూస్ టీమ్ సేకరించిన ఈ టిష్యూస్‌ను పోలీసులు డీఎన్‌ఏ పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
తాజాగా అందిన నివేదిక ప్రకారం.. ఆ టిష్యూస్‌లో లభ్యమైన డీఎన్‌ఏ మాధవిదిగా తేలింది. అంతేకాకుండా ఆ డీఎన్‌ఏ మాధవి తల్లి , పిల్లల డీఎన్‌ఏతో సరిపోలినట్లు ఫోరెన్సిక్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో గురుమూర్తిని దోషిగా నిర్ధారించడానికి పోలీసులకు బలమైన ఆధారం లభించింది.
గురుమూర్తి తన భార్య మాధవిని ఎందుకు హత్య చేశాడు అనే విషయంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. డీఎన్‌ఏ రిపోర్ట్ పోలీసులకు చేరడంతో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
గురుమూర్తిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, తనకు బెయిల్ వద్దని, తన తరపున వాదించేందుకు న్యాయవాదులు కూడా వద్దని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం అతడు చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్నాడు.
- హత్యకు గల కారణాలు.. ముందు ఏం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్య నిత్యం తనను వేధిస్తూ డామినేట్ చేస్తోందని, ప్రతి చిన్న విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి వారితో తనను చిత్ర హింసలకు గురిచేస్తోందనే ఆగ్రహంతోనే గురుమూర్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. హత్య చేసిన అనంతరం ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మాధవి శరీరాన్ని ముక్కలుగా నరికి, ఉడకబెట్టి, ఎముకలను పొడి చేసి చెరువులో పడేశాడు.
మాధవి కనిపించకుండా పోయిందని ఆమె తల్లి ఉప్పాల సుబ్బమ్మ జనవరి 18న మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.
గురుమూర్తికి వివాహేతర సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యను హత్య చేయడానికి గల ఇతర కారణాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
డీఎన్‌ఏ రిపోర్ట్ నిర్ధారణ కావడంతో ఈ కేసులో త్వరలోనే పూర్తిస్థాయి విచారణ జరిపి నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.