కొత్త దేవుడు బాబు కోసం ఈడీని పిలవాలట !

ఇదిలా ఉంటే లోక్ సభలో లావు సోమవారం మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కాం ని తలదన్నేలా ఏపీలో వేల కోట్ల స్కాం వైసీపీ హయాంలో జరిగింది అని ఆరోపించారు.;

Update: 2025-03-25 12:38 GMT

లావు శ్రీకృష్ణదేవరాయలు. వైసీపీ నుంచి ఎంపీ అయిన వారు. ఆ తరువాత 2024లో టీడీపీలో చేరి మరోసారి నరసరావుపేట నుంచి ఎంపీ అయ్యారు. ఆయనకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్ పదవిని కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే లోక్ సభలో లావు సోమవారం మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కాం ని తలదన్నేలా ఏపీలో వేల కోట్ల స్కాం వైసీపీ హయాంలో జరిగింది అని ఆరోపించారు.

ఈ స్కాం ని బయటకు తీసేందుకు ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణ జరిపిస్తోందని అన్నారు. కేంద్రం కూడా జోక్యం చేసుకుని ఈడీని విచారణకు ఆదేశించేలా చూడాలని ఆయన కోరారు. ఇది అతి పెద్ద లిక్కర్ స్కాం అని లావు అన్నారు.

ఇక దాని మీద వైసీపీ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. అన్నది ఎవరో అయితే ఇంత కోపం రాదేమో అయిదేళ్ల పాటు తమతో పాటే ఉండి తమ పార్టీ నుంచి ఎంపీ అయిన లావు ఈ విమర్శలు చేయడంతో సోషల్ మీడియా వేదికగా వైసీపీ తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చేసింది. అది చాలదన్నట్లుగా మాజీ మంత్రి పేర్ని నాని కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ లావు వ్యాఖ్యలను కొట్టిపడేశారు.

లావు ఫ్లెమింగో పక్షి లాంటి వారు అని సెటైర్లు వేశారు. ఆయన వైసీపీ గూడు వీడి టీడీపీ గూడు చేరి చిలకపలుకులు పలుకుతున్నారని అన్నారు. ఆయన కొత్త దేవుడు చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ని పార్లమెంట్ లో చదివారని అన్నారు. లావు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గతంలో ఏమీ లిక్కర్ స్కాం ఏపీలో జరగలేదని ఇపుడు జరుగుతోందని అని పేర్ని అన్నారు.

ఏపీలో మొత్తం లిక్కర్ షాపులను టీడీపీ వారు అంతా చెర పట్టేశారని పేర్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మద్యం ఉత్పత్తి చేసే వారికి మేలు చేస్తూ వారి నుంచి ముడుపులు తీసుకుంటున్నది ఎవరో లావు తెలుసుకోవాలని అన్నారు. అంతటితో ఆగకుండా వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగితే నాడు తమ పార్టీలో ఉన్న లావు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

లిక్కర్ స్కాం మీద ఈడీ దర్యాప్తుని కోరుతున్న లావు పనిలో పనిగా చంద్రబాబుకు ఇంకం టాక్స్ ఎందుకు పదుల పేజీలతో నోటీసులు ఇచ్చిందో కూడా దర్యాప్తు చేయమని కోరాలని అన్నారు. మధ్యలో ఆ విచారణ ఎందుకు ఆగిందో తెలుసుకోవాలని ఈడీని పిలిపించి స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ మీద కూడా దర్యాప్తు చేయించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.

ఏపీలో అమరావతి రాజధానిలో కాంట్రాక్టులు పొందిన అయిదు పెద్ద కంపెనీలు దానికి బదులుగా రెండు వేల కోట్లు అనామతు బాపతు ఖాతాగా ఎవరికి ముడుపులు చెల్లించరో కూడా లావు తెలుసుకోవాలని పేర్ని సెటైర్లు వేశారు. లేని లిక్కర్ స్కాం ని ముందుకు తెచ్చి వైసీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయాలని చూస్తున్నారని పేర్ని నాని విమర్శించారు.

ఈ కేసులో ఎలాగైనా జగన్ ని కూడా తీసుకుని వచ్చి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని కూడా ఆయన కామెంట్స్ చేశారు. మొత్తానికి బాబుని లావుకు కొత్త దేవుడు అంటూ కామెంట్స్ చేసిన పేర్ని లావుని ఫ్లెమింగో పక్షిగా చెప్పడం చిలకపలుకులు అంటూ ఎద్దేవా చేయడం జరిగింది. మరి దీనిని లావు నుంచి ఏ విధమైన రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News