పోసాని దారెటు... రాజకీయాలు చేయాలా? వద్దా ..!
పోసాని కృష్ణమురళి దారెటు? ఆయన రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పినట్టేనా? అంటే.. దీనిపై భిన్నమైన కథనాలు వస్తున్నాయి.;
పోసాని కృష్ణమురళి దారెటు? ఆయన రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పినట్టేనా? అంటే.. దీనిపై భిన్నమైన కథనాలు వస్తున్నాయి. ఆయన వైసీపీతోనే ఉంటారని ఆ పార్టీ నాయకులు చెబుతుండగా.. కాదు.. ఈ సారికి ఆయన బుద్ధి వచ్చిందని.. ఇక నుంచి రాజకీయాలు చేయబోరని పరిశీలకులు వ్యాఖ్యాని స్తున్నారు. వరుస కేసులు నమోదు కావడం.. ఆ జైలు-ఈ జైలు అంటూ.. అధికారులు ప్రదక్షిణలు చేయించడంతో పోసాని సహజంగానే విసిగిపోయారు.
ఉన్నంతలో ఉన్నంత హై ప్రొఫెల్ మెయింటెన్ చేయడంతోపాటు.. మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పే స్వభావం పోసానికి సొంతం. దీంతో ఆయన గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా పలువురిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తీవ్రస్థాయిలో దూషించారు. ఇవే పెను శాపాలై.. ఆయనను జైలుకు వెళ్లేలా చేశాయి. కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయించాయి. ఈ నేపథ్యంలోనే తాను అసలు రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే అసలు పోసాని రాజకీయాలు చేస్తారా? చేయరా? అన్నది ఆసక్తిగా మారింది. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్న వారు కొంత మేరకు జాగ్రత్తలు పాటిస్తే ఎన్నాళ్లయినా రాజకీయాల్లో ఉండొచ్చు. ఉదాహ రణకు మురళీ మోహన్ రాజకీయాల్లో లేరా? నందమూరిబాలయ్య రాజకీయాల్లో లేరా.. అంటే ఉన్నారు. అయితే.. కావాల్సింది సహనం.. సంయమనం. ఈ రెండు అంశాలను జాగ్రత్తగా పరిశీలించుకుంటే.. సినీ రంగమే కాదు.. ఎవరైనా రాజకీయాల్లో ఉండొచ్చు.
పోసాని విషయంలో తేడాకొట్టింది ఇదే. రెచ్చిపొమ్మంటే రెచ్చిపోవడం.. అనేయమంటే అనేయడమే ఆ యనకు శరాఘాతంగా మారింది తప్ప.. పోసాని అంటే వ్యక్తిగతంగా ఎవరికీ వ్యతిరేకత లేదు. పైగా.. ఆయన బలమైన గళం కూడా రాజకీయాలకు మంచి పరిణామమే. అయితే.. ఈ గళాన్ని వినియోగించుకునే తీరు లో ఆయన జాగ్రత్తలు కోల్పోయారు. ఇష్టానుసారం వాదనలకు దిగారు. సో.. దీనిని తగ్గించుకుని.. ప్రజా సమస్యలపైనా.. రాజకీయాలపైనా నిర్మాణాత్మక వైఖరి అవలంభిస్తే.. పోసాని వంటివారికి రాజకీయాలు మంచి భవితవ్యాన్ని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. కావాల్సింది.. ఆలోచనే తప్ప.. ఆవేశం కాదన్న వాస్తవాన్ని ఆయన గ్రహించాలి.