సముద్ర తీర ప్రాంతాల ప్రజలకు రజనీకాంత్ కీలక సూచన
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సముద్రమార్గంగా ఉగ్ర చొరబాట్లను హెచ్చరిస్తూ చేసిన వీడియో ఆసక్తికరంగానే కాదు..;
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సముద్రమార్గంగా ఉగ్ర చొరబాట్లను హెచ్చరిస్తూ చేసిన వీడియో ఆసక్తికరంగానే కాదు.. అందరిని అప్రమత్తం చేసేలా ఉంది. సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉండే తమిళనాడు ప్రజల్ని మరింత జాగరూకుల్ని చేసేలా ఆయన సందేశం ఉందని చెప్పాలి.
మన దేశ కీర్తిని పాడు చేసేందుకు ఉగ్రవాదులు సముద్రమార్గంగా చొరబడి దారుణాలకు తెగబడతారని పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా ముంబయి తీరాన్ని అసరా చేసుకొని 26/11 జరిగిన ఉగ్రదాడిని ఆయన ప్రస్తావించారు. ఈ దారుణ ఉగ్రదాడిలో 175 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని.. సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అనుమానం కలిగితే ఆ సమాచారాన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు ఇవ్వాలన్నారు.
ఉన్నట్లుండి.. ఈ అవగాహన కార్యక్రమం దేనికి? ప్రజల్ని అలెర్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న సందేహం రావొచ్చు. అదేమంటే.. పలు అంశాలపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు వీలుగా వంద మందితో కూడిన సీఐఎన్ఎఫ్ జవాన్లు పశ్చిమ బెంగాల్ నుంచి కన్యాకుమారి (కన్నియాకుమారి) వరకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు 7 వేల కిలోమీటర్లు సైకిల్ ప్రచారయాత్రను చేపట్టారు.
ఇందులో భాగంగా తమిళనాడులోని తీర ప్రాంతాలకు వచ్చే ఈ టీంకు స్వాగతం పలికి.. కుదిరితే వారితో కొంచెం దూరం వెళ్లాలన్న సూచన చేశారు. వారిని ఉత్సాపపర్చాలంటూ తమిళులను ఉద్దేశించి చేసిన ఈ వీడియో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రజనీ ప్రకటన ఎంత పని చేస్తుందో చూడాలి.