ఖతార్ లో టెక్ మహీంద్రా ఉద్యోగి అరెస్టు.. అసలేమైంది?
గుజరాత్ కు చెందిన ఒక ఐటీ ఉద్యోగి ఖతార్ లో పని చేస్తున్నాడు. ఆయన్నుఅక్కడి పోలీసులు డేటా చౌర్యం కేసులో అరెస్టు చేశారు.;
గుజరాత్ కు చెందిన ఒక ఐటీ ఉద్యోగి ఖతార్ లో పని చేస్తున్నాడు. ఆయన్నుఅక్కడి పోలీసులు డేటా చౌర్యం కేసులో అరెస్టు చేశారు. ఇదంతా జరిగి మూడు నెలలు కావటం.. ఇటీవల అతడి తల్లిదండ్రుల పుణ్యమా అని విషయం బయటకు రావటం.. ఆ అంశంపై వారు పోరాడుతున్న వేళలో.. సంస్థ స్పందించిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అరెస్టు జరిగి మూడు నెలలు తర్వాత టెక్ మహీంద్రా సంస్థ ఈ విషయాన్ని బయటకు వెల్లడించటం గమనార్హం.
కష్టసమయంలో తమ ఉద్యోగికి.. వారి కుటుంబానికి తాము మద్దతుగా ఉంటామని టెక్ మహీంద్రా హామీ ఇచ్చింది. ఈ అంశంపై తాజాగా ఖతార్ లోని భారత రాయబారి కార్యాలయం స్పందించింది. ఇంతకూ అసలేం జరిగిందన్న అంశానికి సంబంధించి బాధితుడు తల్లి చెప్పిన వివరాల్ని చూస్తే.. ఆమె కొడుకు అమిత్ గుప్తా ఖతార్ లోని టెక్ మహీంద్రా కంపెనీలో మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. డేటా చౌర్యం ఆరోపణలతో తన కొడుకును ఖతార్ పోలీసులు జనవరి 1న అదుపులోకి తీసుకున్నారు. 48 గంటల పాటు నీళ్లు.. ఆహారం ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.
మూడు నెలలుగా దోహాలో బంధించి ఉంచారన్న ఆమె.. ‘నా కొడుకు నిర్దోషి. ఎవరో కావాలనే తప్పుడు కేసులో అతడ్ని ఇరికించారు. సంస్థలో ఎవరో తప్పు చేస్తే ఖతార్ - కువైట్ రీజియన్ కు హెడ్ స్థానంలో ఉన్న నా కొడుకును ఎలా అరెస్టు చేస్తారు? ఈ విషయాన్ని ఎవరూ కూడా మాకు చెప్పే ప్రయత్నం చేయలేదు. గడిచిన కొద్ది రోజులుగా మాకు మా అబ్బాయి ఫోన్ చేయటం లేదు. దీంతో అనుమానం వచ్చిన అతడి స్నేహితుడికి ఫోన్ చేస్తే అసలు విషయం తెలిసింది’ అని జరిగిన వివరాల్ని వెల్లడించారు.
తమ కొడుకును అరెస్టు చేశారన్న విషయం తెలిసినంతనే తాము దోహాకు వెళ్లి ఎంబసీ అధికారుల్ని కలిశామని.. అయినా లాభం లేకపోయిందన్నారు. తమ కొడుకును విడిపించేందుకు సాయం కోసం వడోదర ఎంపీ హేమాంగ్ జోషిని సాయం కోరగా.. ఆయన ఈ విషయాన్ని ఉన్నతాధికారుల ద్రష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారన్నారు. ఈ అంశంపై భారత విదేశాంగ అధికారులు మాట్లాడుతూ.. గుప్తా అరెస్టుపై ఖతార్ విదేశాంగ శాఖతో చర్చలు జరుపుతున్నామని.. అతడ్ని విడుదల చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై టెక్ మహీంద్రా స్పందిస్తూ.. తమ ఉద్యోగితో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని.. వారి కుటుంబానికి మద్దతుగా ఉంటామన్న హామీ ఇచ్చింది. కాకుంటే.. ఇన్ని రోజుల పాటు ఈ విషయం వెలుగు చూడకపోవటం ఏమిటి? అన్నదే అసలు ప్రశ్నగా చెప్పాలి.