అమెరికాలో దారుణం... ఏపీకి చెందిన ఎన్నారై కుటుంబంలో తీవ్ర విషాదం!
ఈ బీభత్సం కారణంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ సుమారు 35 మంది మరణించారని, పలువురు గాయపడ్డారని చెబుతున్నారు.;
అమెరికాలో పెను తుపాను, టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బలమైన గాలుల కారణంగా ఇళ్లు, భవనాల పైకప్పులు కూలిపోయాయి. ఈ బలమైన గాలులకు పెద్ద పెద్ద ట్రక్కులు సైతం బోల్తా పడ్డాయి. ఈ బీభత్సం కారణంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ సుమారు 35 మంది మరణించారని, పలువురు గాయపడ్డారని చెబుతున్నారు.
ఇందులో భాగంగా.. గాలుల కారణంగా కాన్సస్ లో 8 మంది మృత్యువాత పడ్డారని.. మిస్సోరీలోని బేకర్స్ ఫీల్డ్ ప్రాంతంలో 12 మంది.. మిసిసిపిలో ఆరుగురు.. టెక్సాస్ లోని అమరిల్లో, ఆర్కాన్సాస్ లో, అలబామలో ముగ్గురేసి చొప్పున చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఓ తెలుగు కుటుంబం కూడా తీవ్ర విషాదంలో పడిపోయింది.
అవును... అమెరికాలో పెను తుపాను, టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బలమైన గాలులు అల్లకల్లోలం సృషిస్తున్నాయి. ఈ గాలుల కారణంగా ఓక్లహోమాలో ఏకంగా 300 ఇళ్లు ధ్వంసమైనట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో... నార్త్ కరోలినాలో ఈ తుపాను కారణంగా ప్రవాస భారతీయ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రవాస భారతీయ కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. దీంతో... తెనాలి అయితానగర్ లో విషాదం అలుముకుంది! పిల్లలు నిద్రిస్తున్న సమయంలో ఇళ్లు పాక్షికంగా కూలడంతోనే వీరు ఇద్దరూ మృతిచెందినట్లు చెబుతున్నారు.
తెనాలికి చెందిన బిషప్ గడ్డం థామస్ కుమార్తె షారోన్ నథానియేల్ కు.. అమెరికాకు చెందిన నథానియేల్ లివిస్కాతో 2007లో వివాహమైంది. ఈ దంపతులు అమెరికాలోనే నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఈ క్రమంలో.. ఆదివారం తెల్లవారుజామున అమెరికాలో సంభవించిన తుపానుకు ఓ భారీ వృక్షం వీరి ఇంటిపై పడింది.
ఆ సమయంలో.. ఇల్లు పాక్సికంగా కూలిపోయింది. అప్పుడు బెడ్ రూమ్ లో నిద్రిస్తున్న షారోన్ కుమారులు సాధు జోషయ్య (13), జాషువా అషెవల్ (11) ప్రాణాలు విడిచారు. సమాచారం తెలియగానే షారోన్ తల్లి మేరీగ్రేస్, సోదరుడు సాధు థామస్ లు అమెరికాకు పయనమయ్యారని అంటున్నారు.