భారతీయ విద్యార్థులు అమెరికాలో నేర్వాల్సింది ఇదే!

తిన్నింటివాసాలు ఎప్పుడూ లెక్కబెట్టొద్దంటారు.. ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా ఆ దేశం అడుగుజాడల్లోనే నడవాలి.;

Update: 2025-03-22 11:30 GMT

తిన్నింటివాసాలు ఎప్పుడూ లెక్కబెట్టొద్దంటారు.. ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా ఆ దేశం అడుగుజాడల్లోనే నడవాలి. అమెరికాలో భారతీయ నిబంధనలు పాటిస్తామని.. సంప్రదాయాలు ఆచరిస్తామంటే కుదరదు.. స్వేచ్ఛ స్వాతంత్య్రాలు ఉండే అగ్రరాజ్యంలో ఇప్పుడు అధికారం మారడంతో అంతే నిబంధనలు కఠినతరమయ్యాయి. అమెరికాలో ఇండియన్ లా ఉంటామంటే కుదరదు.. అమెరికాలో అమెరికన్ లాగా ఉంటేనే మనగుడ సాగించగలం.. ముఖ్యంగా చదువుకోవడానికి అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులు ఇది పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


అమెరికాలోని భారతీయ విద్యార్థులు ఆ దేశ చట్టాలకు కట్టుబడి ఉండాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పష్టం చేసింది. ఇటీవల ఇద్దరు భారతీయ విద్యార్థుల వీసాలు రద్దు చేయబడిన నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేయబడ్డాయి. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం , కాన్సులేట్ కార్యాలయాలు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీసా , వలస విధానాలకు సంబంధించిన నిర్ణయాలు పూర్తిగా ఆయా దేశాల యొక్క ప్రత్యేక హక్కు అని, వాటిని గౌరవించడం , పాటించడం విద్యార్థుల బాధ్యత అని పేర్కొంది.

వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో పోస్ట్-డాక్టోరల్ పరిశోధకుడిగా ఉన్న బదర్‌ఖాన్ సూరి, హమాస్‌కు మద్దతుగా విశ్వవిద్యాలయంలో ప్రచారం చేస్తున్నాడని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఆరోపించారు. దీని ఫలితంగా అతని వీసా రద్దు చేయబడింది. గత సోమవారం వర్జీనియాలోని అతని నివాసం నుండి అదుపులోకి తీసుకోబడ్డాడు. అయితే, వర్జీనియా కోర్టు అతనికి తాత్కాలిక ఉపశమనం కలిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అతని బహిష్కరణను నిలిపివేసింది.

మరో ఘటనలో పాలస్తీనాకు అనుకూలంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నందుకు రంజని శ్రీనివాసన్ అనే భారతీయ విద్యార్థిని వీసా కూడా రద్దు చేయబడింది. ఆమె కార్యకలాపాలు తీవ్రవాద సంస్థ హమాస్‌కు మద్దతుగా ఉన్నాయని అమెరికా పేర్కొంది. ఈ నెల 5న వీసా రద్దు కావడంతో ఆమె స్వయంగా అమెరికాను విడిచి వెళ్లిపోయింది.

ఈ వరుస పరిణామాలపై భారత ప్రభుత్వం స్పందించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఇద్దరు విద్యార్థులు కూడా సహాయం కోసం అమెరికాలోని భారతీయ దౌత్య కార్యాలయాలను సంప్రదించలేదని తెలిపారు."భారతదేశానికి విదేశీ పౌరులు వచ్చినప్పుడు, వారు మన చట్టాలు , నిబంధనలకు కట్టుబడి ఉండాలని మేము ఆశిస్తాము. అదేవిధంగా భారతీయ పౌరులు విదేశాలలో ఉన్నప్పుడు, వారు అక్కడి చట్టాలు.. నిబంధనలను పాటించాలి" అని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల కళాశాలలు, పాఠశాలలు , విశ్వవిద్యాలయాలను ఉద్దేశించి ట్రంప్ చేసిన హెచ్చరికలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. చట్టవిరుద్ధ నిరసనలను అనుమతించే విద్యా సంస్థలకు ఫెడరల్ నిధులను నిలిపివేస్తామని, ఆందోళనకారులను జైలుకు లేదా వారి స్వదేశానికి పంపిస్తామని ఆయన హెచ్చరించారు. అమెరికన్ విద్యార్థులైతే శాశ్వత బహిష్కరణ లేదా అరెస్టును ఎదుర్కోవలసి ఉంటుందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ హెచ్చరికల ప్రభావం సూరి , శ్రీనివాసన్‌లపై కనిపించింది.

Tags:    

Similar News