మరణాన్నైనా ప్రకటించండి.. సుదీక్ష కథ ఒక విషాద గాథ..

ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె మరణాన్ని అయినా ప్రకటించాలని అధికారులను వేడుకుంటున్నారు.;

Update: 2025-03-18 16:30 GMT

అమెరికా పక్కన ఉండే వెస్టిండీస్ దేశాల్లో ఒకటైన డొమినికన్‌ రిపబ్లిక్‌లో భారత సంతతి యువతి సుదీక్ష కోణంకి అదృశ్యం మిస్టరీ ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె మరణాన్ని అయినా ప్రకటించాలని అధికారులను వేడుకుంటున్నారు. వారి మాటల్లో అనుమానం లేదు.. కేవలం తీరని దుఃఖం మాత్రమే వినిపిస్తోంది.

సుదీక్ష, చురుకైన భవిష్యత్తును కలలుగంటూ డొమినికన్‌ రిపబ్లిక్‌కు వెళ్లిన ఒక భారతీయ సంతతి విద్యార్థిని. ఆమె అదృశ్యం ఒక పెద్ద ప్రశ్నార్థకంగా నిలిచింది. పోలీసులు ఆమె జాడ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, ఆశలు సన్నగిల్లుతున్నాయి. తమ కుమార్తె ఇక లేదనే నిజాన్ని అంగీకరించిన సుదీక్ష తల్లిదండ్రులు, డొమినికన్‌ అధికారులకు ఒక లేఖ రాశారు. తమ కుమార్తె మృతిని అధికారికంగా ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు. తమకు ఎవరిపైనా అనుమానం లేదని, అందుకే ఈ నిర్ణయానికి వచ్చామని వారు స్పష్టం చేశారు. చట్టపరమైన ప్రక్రియలను తాము అర్థం చేసుకున్నామని ఈ విషయంలో అధికారులకు పూర్తిగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు.

సుదీక్ష కనిపించకుండా పోవడానికి ముందు, ఆమె తన సీనియర్ అయిన 24 ఏళ్ల జాషువా స్టీవెన్‌రిబెతో కలిసి బీచ్‌కు వెళ్లిందని దర్యాప్తులో తేలింది. పోలీసులు అతడిని ప్రశ్నించగా ఆ రోజు వారిద్దరూ కలిసి ఉన్నారని రిబె అంగీకరించాడు. బీచ్‌లో ఉండగా ఒక పెద్ద అల వచ్చి వారిని బలంగా తాకిందని దానితో తాను స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని అతను చెప్పాడు. పోలీసులు అతడి వాంగ్మూలాన్ని పరిశీలించి, అతడి తప్పేమీ లేదని నిర్ధారించారు.

లౌడాన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం అందించిన సమాచారం ప్రకారం.. సుదీక్ష తన ఐదుగురు స్నేహితురాళ్లతో కలిసి ఒక బార్‌కు వెళ్లింది. అక్కడ వారు మద్యం సేవించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అక్కడే ఆమె రిబెను కలిసింది. ఆ తర్వాత, ఆమె చివరిసారిగా రియూ రిపబ్లికా రిసార్ట్ బీచ్ వద్ద కనిపించింది.

మొదటి నుండి సుదీక్ష తల్లిదండ్రులు తమ కుమార్తె అదృశ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండవచ్చని వారు భావించారు. అపహరణ కోణంలో కూడా దర్యాప్తు చేయాలని వారు అధికారులను కోరారు. కానీ ఇప్పుడు, వారు తమ కుమార్తె మరణాన్ని ప్రకటించమని అధికారులను వేడుకోవడం వారి దుఃఖాన్ని తెలియజేస్తోంది.

కాలం గడుస్తున్న కొద్దీ సుదీక్ష అదృశ్యం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఆమె తల్లిదండ్రుల వేదన, న్యాయం కోసం వారి నిరీక్షణ అందరినీ కలచివేస్తోంది. ఒక తండ్రి, ఒక తల్లి తమ బిడ్డ ఇక లేరనే చేదు నిజాన్ని అంగీకరించి, ఆ విషాదాన్ని అధికారికంగా ప్రకటించాలని కోరడం అత్యంత హృదయ విదారకమైన విషయం. వారి దుఃఖానికి అంతు లేదు, వారి వేదనను ఓదార్చే వారెవ్వరూ లేరు. సుదీక్ష కథ ఒక విషాద గాథగా మిగిలిపోయింది, దూరమైన వారిని గుర్తు చేస్తూ, అంతులేని ప్రశ్నలను రేకెత్తిస్తూ...

Tags:    

Similar News