విజయసాయికి మళ్లీ పిలుపు.. ఈ సారి ఎవరికి ఎర్త్ పెడతారో?
వైసీపీ మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఏపీ సీఐడీ రెండోసారి నోటీసులు జారీ చేసింది.;
వైసీపీ మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఏపీ సీఐడీ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఆయనను విచారించిన సీఐడీ, అవసరమైతే రెండోసారి విచారణకు రావాల్సివుంటుందని అప్పట్లోనే చెప్పింది. ఆ ప్రకారమే తాజాగా నోటీసులిచ్చింది. ఈ నెల 25న విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొంది. కాకినాడ సీపోర్టు వాటాల బదిలీపై విజయసాయిరెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఆయన విచారణ అధికారులకు సహకరిస్తానని చెబుతూ వైసీపీ నేతలు స్కాములు చేశారంటూ వారి పేర్లు బయటపడుతున్నారు. దీంతో రెండో విడత విచారణలో ఆయన ఎవరి పేర్లు బయటపెడతారనే టెన్షన్ వైసీపీలో కనిపిస్తోందని చెబుతున్నారు.
ప్రతిపక్ష వైసీపీకి విజయసాయి టెన్షన్ వదలడం లేదు. కాకినాడ సీపోర్టు వాటాల బదిలీలో కర్త, కర్మ, క్రియ అంతా రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అంటూ ఈ నెల 12న బాంబు పేల్చిన విజయసాయి, అదే సమయంలో లిక్కర్ స్కాంలో సూత్రధారి, పాత్రధారి అంటూ మాజీ ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పారు. ఈ ఇద్దరు వైసీపీ అధిష్టానంతో నేరుగా సంబంధాలు కలిగిన వారే కావడంతో పార్టీలో పెను దుమారమే చెలరేగింది. లిక్కర్ స్కాంలో తనకు తెలిసినందంతా చెప్పేస్తానని విజయసాయి గతంలో చెప్పడం వైసీపీలో టెన్షన్ పుట్టిస్తోంది. ఇప్పటికే లిక్కర్ స్కాంపై ప్రభుత్వం సిట్ వేసింది. వైసీపీలోని ముఖ్యమైన నేతలకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే రాజంపేట వైసీపీ ఎంపీ పి.మిథున్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు.
ప్రభుత్వ ఆరోపణలకు విజయసాయి వాంగ్మూలం సాక్ష్యంగా వినియోగించుకుంటారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి.. వైసీపీలో తనకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారు. ప్రధానంగా మాజీ సీఎం జగన్ చుట్టూచేరిన కోటరీ వల్ల అధినేతకు తనకు మధ్య గ్యాప్ వచ్చిందని భావిస్తున్నారు. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చినందున తనను అవమానించిన వారిపై ప్రతీకారం తీర్చుకునేలా ఆయన అడుగులు వేస్తున్నారని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. అందుకే వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి పేరుతోపాటు లిక్కర్ స్కాంలో రాజ్ కసిరెడ్డి పేరు బయటపెట్టినట్లు సందేహిస్తున్నారు.
తొలి విడత విచారణలోనే పూస గుచ్చినట్లు చెప్పిన విజయసాయిరెడ్డి.. ఇంకా మిగిలే వుందని అప్పట్లోనే హెచ్చరించారు. అన్నట్లుగానే రెండో విడత విచారణలో మరికొందరి పేర్లు, పాత్రపై సమాచారమిస్తారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఎవరి పేర్లు బయటపెడతారు? ఆయనకు పార్టీలో వ్యతరేకంగా పనిచేసిన వారిని కేసుల్లో ఇరికించేలా సీఐడీకి వాంగ్మూలమిస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ సీఎం జగన్ కోటరీపై విమర్శలు చేస్తున్న విజయసాయి గత ప్రభుత్వంలో చోటుచేసుకున్నాయని చెబుతున్న కుంభకోణాలకు వారే కారణమనే సమాచారం ఏమైనా ఇస్తారా? అనేది ఆసక్తి రేపుతోంది.
వాస్తవానికి పోలీసు విచారణ అంటే ఎవరైనా నిందితులు టెన్షన్ పడాల్సివుంటుంది. కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ కేసులో ఏ 2 నిందితుడైన విజయసాయిరెడ్డిలో ఆ టెన్షన్ కనిపించడం లేదు. ఆయన తన సహచరులను టెన్షన్ పెట్టేలా వ్యవహరిస్తుండటమే రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతానికి రెండు వ్యవహారాల్లో విజయసాయి ఇద్దరి పేర్లు చెప్పారు. ఇక 25న జరిగే విచారణలో ఏ స్కాంలో ఎవరి పాత్ర ఎంత? ఎలా స్కాంలు చేశారనేది పూర్తిగా వివరించేస్తారా? అనేది డౌట్ కొడుతోంది. గత ప్రభుత్వంలో జరిగినట్లు చెబుతున్న స్కాంలపై కేసులు నమోదు చేస్తే విజయసాయిరెడ్డి అప్రూవర్ గా కూడా మారిపోయే అవకాశం ఉందని చెబుతుండటం కూడా వైసీపీని ఆందోళనకు గురిచేస్తోందని అంటున్నారు.