సునీత విలియమ్స్ కోసం యజ్ఞం... భూమిపై ఆమెకు ఎదురయ్యే సమస్యలివేనా?

అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమికి తిరుగు పయనమయ్యారు.;

Update: 2025-03-18 16:15 GMT

అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమికి తిరుగు పయనమయ్యారు. దీంతో... సునీత రాక కోసం భారత్ లోని ఆమె పూర్వీకుల గ్రామం ఎదురుచూస్తోంది. మరోపక్క.. 9 నెలల తర్వాత భూమికి రానుండటంతో.. ఇక్కడ సునీత ఎదుర్కొనే సమస్యలపైనా చర్చ మొదలైంది.

అవును... అమెరికా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తొమ్మిది నెలల తర్వాత భూమికి తిరిగి వస్తున్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో.. గుజరాత్ లోని ఝులాసన్ లో ఉంటున్న సునీత విలియమ్స్ పూర్వికులు ఆమె రాకపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన ఆమె సోదరుడు దినేష్ రావల్... సోదరి సునీత రాక కోసం తామంతా ఎంతో ఎదురుచూస్తున్నామని.. ఆమె తల్లి, సోదరి, సోదరుడు సహా భారత్ లోని కుటూంబంలోని ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉన్నారని.. ఇది తమకు ఎంతో చిరస్మరణీయమైన రోజని.. ఆమె సురక్షితంగా భూమికి చేరుకోవాలని యజ్ఞం నిర్వహిస్తున్నామని తెలిపారు.

సునీతకు ఎదురయ్యే సమస్యలివేనా?

అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు సుమారు 9 నెలల 13 రోజుల తర్వాత తిరిగి భూమికి వస్తున్నారు. ఇలా తొమ్మిది నెలలుగా భూ వాతావరణానికి దూరంగా ఉన్న ఈ వ్యోమగాములు ఇప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోనున్నారనేది ఆసక్తిగా మారింది. వీరు ఇప్పుడు భూమిపై నడక మరిచిపోవచ్చని అంటున్నారు.

ఎందుకంటే... భూమిపై మనం నడిచినప్పుడు, కుర్చున్నప్పుడు, లేచినప్పుడు కండరాలు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. అయితే.. అంతరిక్షంలో సున్నా గురుత్వాకర్షణ శక్తి వల్ల కండరాలు పనిచేయవని అంటున్నారు. అందువల్ల ఈ వ్యోమగాములు భూమిపై వెంటనే నడవలేని స్థితిని ఎదుర్కొంటారని అంటున్నారు.

ఇదే సమయంలో.. అంతరిక్షంలో సున్నా గురుత్వాకర్షణ కారణంగా మెదడులోని శరీర సమతుల్యతను కాపాడే వెస్టిబ్యులర్ వ్యవస్థ సరిగ్గా పనిచేయదని.. అందువల్ల భూమికి తిరిగొచ్చిన వ్యోమగాములు కొంతకాలం సరిగ్గా నిలబడకపోవడమే కాదు.. కాళ్లు, చేతులను సరిగ్గా బ్యాలెన్స్ చేయలేరని ఆంటున్నారు.

వీటితో పాటు అధిక రేడియేషన్ కు గురికావడం వల్ల క్యాన్సర్ ముప్పు వాటిళ్లడంతో పాటు.. డీ.ఎన్.ఏ దెబ్బతినడం, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం, మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది వంటి సమస్యలను వ్యోమగాములు ఎదుర్కొంటారని అంటున్నారు.

Tags:    

Similar News