ఆంధ్రా To అమెరికా @ డైవర్షన్ పాలిటిక్స్!

ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు, వివిధ స్థాయిల్లోని ప్రభుత్వాలు ఇదే పంథాను అనుసరిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 'డైవర్షన్ పాలిటిక్స్' యొక్క లోతుల్లోకి వెళ్లి విశ్లేషిద్దాం;

Update: 2025-03-18 13:05 GMT

‘పైసల్ లేవు’.. ప్రభుత్వాలు నడవడానికి ఖజానా ఖాళీగా ఉంది.. అధికారంలోకి రావడానికి బోలెడన్నీ హామీలిచ్చాం.. ప్రజలు ఖాళీగా ఉంటే నిలదీస్తారు.. మరి ఏం చేయాలి.. ఏం చేయాలని బుర్రల బద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు.. ప్రజలను ఏదో వివాదంపైకి దృష్టి మరలేలా చేయాలి.. ఆంధ్రా నుంచి అమెరికా దాకా ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. అవును.. అదే ‘డైవర్షన్ పాలిటిక్స్’.. రాజకీయాల్లో 'డైవర్షన్ టెక్నిక్స్' కొత్తేమీ కాదు. ప్రజల దృష్టిని ముఖ్యమైన సమస్యల నుంచి మళ్లించి, వేరే అంశాలపై కేంద్రీకరించే ప్రయత్నమిది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు, వివిధ స్థాయిల్లోని ప్రభుత్వాలు ఇదే పంథాను అనుసరిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 'డైవర్షన్ పాలిటిక్స్' యొక్క లోతుల్లోకి వెళ్లి విశ్లేషిద్దాం.

-  ఆంధ్రా To అమెరికా @ డైవర్షన్ పాలిటిక్స్

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపించింది. దీంతో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే గత ప్రభుత్వం చేసిన సంక్షేమం, అప్పులతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి పెనుభారంగా మారిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఖజానా ఖాళీగా ఉందనే వాస్తవం ఒక పెద్ద సవాలుగా మారింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఇదే పెద్ద కష్టంగా మారింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ఏపీ అర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఎంతలా ఏపీ ఆర్థిక వ్యవస్థ కునారిల్లిందో ఆయన లెక్కలతో సహా బయటకు వివరించారు. ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ, 40 ఏళ్ల రాజకీయంలోనూ ఇంతటి ఘోరమైన ఆర్థిక స్థితిని చూడలేదని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ సిట్యుయేషన్ తెలిసి ఉంది అలా ఎందుకు అమలుకాని ఎన్నికల హామీలు ఇచ్చారు. ప్రజలు నమ్మి అధికారం ఇచ్చారు అయితే అది ఇప్పుడు యాంటీ అవ్వుతుంటే దాని గురుంచి డైవర్షన్ పాలిటిక్స్‌ను నడుస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. 

రెడ్ బుక్ పేరిట అరెస్ట్ లు, సనాతన ధర్మం పేరిట పవన్ కళ్యాణ్ దీక్షలు, కొందరు ప్రముఖ నటులు, నేతలపై కేసులు, గత ప్రభుత్వ పథకాల పేర్లు మార్చడం వంటి చర్యలు జరుగుతుండడంతో ఆటోమేటిక్ గా ప్రజల దృష్టి మారుతోంది.. ఏదో ఒక వివాదంతో ఏపీ ప్రజల్లో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది.

- తెలంగాణ: ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి?

తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలను ప్రకటించి అధికారంలోకి వచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చాక ఆ హామీల అమలుపై స్పష్టమైన కార్యాచరణ కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.. ఎందుకంటే తెలంగాణ కూడా మిగులు రాష్ట్రం నుంచి అప్పుల రాష్ట్రంగా మారిందని..జీతాలకే డబ్బులు లేవని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. 6 గ్యారెంటీలపై ప్రతిపక్ష బీఆర్ఎస్, ప్రజలు నిరసిస్తున్న వేళ.. తెలంగాణలోని కొన్ని పరిణామాలు చూస్తుంటే ఇక్కడా డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? అన్న అనుమానాలు రాకమానవు. ప్రతిపక్ష నేతలపై కేసులు.. జర్నలిస్టుల అరెస్టులు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలెబ్రెటీలపై కేసులు తెరపైకి తేవడం ద్వారా తెలంగాణలోనూ డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్న చర్చ ప్రారంభమైంది.

- దేశం: మోడీ సర్కార్ అదే పనిచేస్తోందా?

ఇక జాతీయ స్థాయిలో చూస్తే ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పడిపోతున్నా, నిరుద్యోగం పెరుగుతున్నా, ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్, మతం, హిందీ భాష వంటి అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకేలు విమర్శిస్తున్నాయి. జాతీయవాదం, మతపరమైన అంశాలను ప్రధానంగా ప్రచారం చేస్తూ, ఆర్థిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం జరుగుతోందనేది ప్రతిపక్షాలు, విశ్లేషకుల అభిప్రాయం.

-అమెరికా: ట్రంప్ వ్యూహం ఏమిటి?

అమెరికాలోనూ ఇదే తరహా రాజకీయాలు కనిపిస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ హయాంలో ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైందని, ద్రవ్యోల్బణం పెరిగిందని విమర్శలు ఉన్నాయి. అయితే, ట్రంప్ తన పాలనలో కెనడా, మెక్సికోలపై ఆంక్షలు విధించడం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి అంతర్జాతీయ అంశాలను ఎక్కువగా ప్రస్తావించారు. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి నుంచి పలు అంశాల్లో చేతులెత్తేయడం, ఇతర దేశాలకు సహాయం నిలిపివేయడం వంటి నిర్ణయాలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఇవన్నీ దేశంలోని ఆర్థిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో భాగంగానే జరిగాయనే వాదనలు ఉన్నాయి.

- వాస్తవ సమస్యల నుంచి దృష్టి మళ్లించడం

ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు గమనిస్తే, అన్ని చోట్లా ప్రభుత్వాలు ఏదో ఒక రూపంలో డైవర్షన్ పాలిటిక్స్ ను ఆశ్రయిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రజల దృష్టిని తమ వైఫల్యాల నుంచి నెరవేర్చని హామీల నుంచి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల ముందు ఒకలా మాట్లాడటం.. అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరించడం సాధారణమైపోయింది.

- విశ్వాసం కోల్పోతున్న ప్రజలు

ఈ తరహా రాజకీయాల వల్ల ప్రజల్లో ప్రభుత్వాలపై విశ్వాసం సన్నగిల్లుతోంది. నిజమైన సమస్యలు పరిష్కరించబడకపోగా, అనవసరమైన వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఇది దేశాభివృద్ధికి, ప్రజల శ్రేయస్సుకు ఏమాత్రం మంచిది కాదు. ప్రభుత్వాలు తమ ప్రధాన బాధ్యతలను విస్మరించి, కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.

- మారాల్సిన రాజకీయ సంస్కృతి

చివరగా చెప్పేది ఏమిటంటే.. ప్రభుత్వాలు ప్రజల సమస్యలపై నిజమైన దృష్టి సారించాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేయాలి. డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా తాత్కాలికంగా ప్రజల దృష్టిని మళ్లించగలరేమో కానీ, దీర్ఘకాలంలో ఇది ప్రభుత్వాల విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. రాజకీయ నాయకులు ఈ విషయాన్ని గ్రహించి, బాధ్యతాయుతమైన పాలన అందించడానికి ప్రయత్నించాలని ఆశిద్దాం.

Tags:    

Similar News