నాగబాబుకు కొత్త బాధ్యతలు...వర్మకు షాకేనా ?

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ అయిన కొణిదెల నాగబాబు ఇపుడు ఆ పార్టీలో అత్యంత కీలకంగా మారిపోయారు.;

Update: 2025-03-18 19:30 GMT

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ అయిన కొణిదెల నాగబాబు ఇపుడు ఆ పార్టీలో అత్యంత కీలకంగా మారిపోయారు. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తోడుగా నీడగా ఇప్పటికే వ్యవహరిస్తున్నారు. రానున్న రోజులలో ఆయన మరింతగా తన పాత్రను పెంచుకుంటారని అంటున్నారు.

నాగబాబు ఎమ్మెల్సీ కాబట్టి ఆయనకంటూ ఒక నియోజకవర్గం అయితే ఉండదు. ఆయన ఎక్కడైనా తన పాత్రను నిర్వహించవచ్చు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాగబాబుకు పార్టీ బాధ్యతలతో పాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురం బాధ్యతలు కూడా అప్పగించాలని చూస్తున్నారు అని అంటున్నారు.

పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ ఉన్నారు. అయితే ఆయన ఉప ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా ఎంతో బిజీగా ఉంటారు. దాంతో ఆయన తరఫున మొత్తం నియోజకవర్గంలోని ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను నిర్వహించేందుకు నాగబాబుని నియమిస్తారని అంటున్నారు. ఆయననే జనసేన ఇంచార్జి గా చేస్తారని అంటున్నారు.

ఇక నాగబాబు ఎటూ అధికారంలో ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆయన అధికారులతో కలసి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్ష చేయడంతో పాటు నియోజకవర్గంలో ఏమేమి చేయాలి ఏమేమి కావాలి అన్నది కూడా పూర్తి స్థాయిలో మధింపు చేస్తారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే పిఠాపురం జనసేన అడ్డా అని ఆ పార్టీ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇక నాగబాబు అయితే పవన్ ఫ్యాక్టర్ పిఠాపురంలో బలంగా ఉందని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పిఠాపురాన్ని పవన్ కి సొంత నియోజకవర్గంగా శాశ్వతం చేసేందుకు పక్కా ప్లాన్ ని రూపొందించారని అంటున్నారు.

ఇదిలా ఉంటే పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మకు ఉన్న పలుకుబడి చాలా ఎక్కువ అన్నది 2014 ఎన్నికల్లో రుజువు అయింది. ఆయన టీడీపీ టికెట్ దక్కించుకో పోయినప్పటికీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరీ 47 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన 2024 ఎన్నికల్లో పవన్ విజయంలోనూ కీలకమైన భూమిక పోషించారు.

ఈ నేపధ్యంలో చూస్తే కనుక వర్మ ప్రాబల్యం తగ్గించాల్సిన అవసరం ఉందని జనసేన భావిస్తోందా అన్న చర్చకు తెర లేస్తోంది. జనసేనకు నూరు శాతం పిఠాపురం మద్దతు దక్కాలీ అంటే నాగబాబు వంటి మెగా ఫిగర్ ని పొలిటికల్ గా అక్కడ ఎస్టాబ్లిష్ చేయడమే మార్గమని భావిస్తున్నారని అంటున్నారు.

దీని వల్ల భవిష్యత్తులో జనసేన జెండా ఎదురులేకుండా ఎగురుతుందని అదే సమయంలో పిఠాపురంలో గెలుపు మా వల్లనే అని ఎవరూ చెప్పుకోకుండా చూసేందుకు కూడా వీలు పడుతుందని అంటున్నారు. మొత్తం మీద వర్మకు ఎమ్మెల్సీ దక్కకపోవడం నాగబాబుకు దక్కడం ఒక ఎత్తు అయితే ఇపుడు అదే నాగబాబు పిఠాపురంలో జనసేనానిగా ముందుకు వస్తే అపుడు రాజకీయం రంజుగా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.

Tags:    

Similar News