హెచ్‌-1బీ వీసాలో కీలక మార్పులు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలస విధానాలపై ప్రత్యేక దృష్టి సారించారు.. ఈ క్రమంలో భాగంగానే వీసా జారీ ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకు ఆయన ప్రభుత్వం తాజాగా చర్యలు చేపట్టింది.;

Update: 2025-03-20 10:30 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలస విధానాలపై ప్రత్యేక దృష్టి సారించారు.. ఈ క్రమంలో భాగంగానే వీసా జారీ ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకు ఆయన ప్రభుత్వం తాజాగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వీసా దరఖాస్తుల పరిశీలన కోసం ఉపయోగిస్తున్న ఫారిన్‌ లేబర్‌ యాక్సెస్‌ గేట్‌వే వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

మార్చి 20 (అమెరికా కాలమానం ప్రకారం) నుంచి ఈ వ్యవస్థలోని ఐదేళ్ల కంటే పాతవైన రికార్డులు, దరఖాస్తులన్నింటినీ తొలగించనున్నారు. దీంతో హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌లో గణనీయమైన మార్పులు రానున్నాయి.

కొత్త ఆదేశాల ప్రకారం, మార్చి 20వ తేదీ నుంచి ఐదు సంవత్సరాల కన్నా ముందు నాటి అన్ని డాక్యుమెంట్లు సిస్టమ్ నుంచి శాశ్వతంగా తొలగించబడతాయి. ఉదాహరణకు, ఒక దరఖాస్తుకు సంబంధించి 2020 మార్చి 22న తుది నిర్ణయం వెలువడి ఉంటే, ఆ రికార్డును ఈ ఏడాది మార్చి 22న తొలగిస్తారు. ఈ నేపథ్యంలో, ఉద్యోగులకు సంబంధించిన ఐదేళ్ల కంటే పాతవైన వీసా రికార్డులను మార్చి 19వ తేదీలోగా తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని సంబంధిత సంస్థలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అలా చేయని పక్షంలో ఆ రికార్డులను కోల్పోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

ఈ రికార్డుల తొలగింపు హెచ్‌-1బీ వీసాలతో పాటు అన్ని రకాల తాత్కాలిక లేబర్‌ కండిషన్ అప్లికేషన్స్‌ , శాశ్వత లేబర్‌ సర్టిఫికేట్ అప్లికేషన్స్‌ పై కూడా ప్రభావం చూపనుంది. ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ విభాగం అధికారికంగా నోటీసులు జారీ చేసింది. వీసాల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు యూఎస్ ఇమిగ్రేషన్ విభాగం త్వరలోనే కొత్త దరఖాస్తు విధానాన్ని ప్రారంభించనుంది. దరఖాస్తుదారులందరికీ మరింత పారదర్శకంగా సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది. అందుకే పాత రికార్డులను తొలగిస్తున్నట్లు తెలిపింది.

ఇదిలా ఉండగా, ఈ సంవత్సరం నుంచి హెచ్‌-1బీ వీసాల జారీలో అమెరికా ప్రభుత్వం నూతన విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇకపై, ఒక లబ్ధిదారుడు ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా వాటిని ఒకే అప్లికేషన్‌గా పరిగణించనున్నారు. రిజిస్ట్రేషన్ల సంఖ్యతో సంబంధం లేకుండా, అర్హులైన దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ‘కేంద్రీకృత-ఎంపిక ప్రక్రియ’ ను ప్రవేశపెట్టారు.

గతంలో కొన్ని సంస్థలు ఒకే లబ్ధిదారుని తరఫున అనేక రిజిస్ట్రేషన్లు సమర్పించి లాటరీ విధానంలో అక్రమంగా లబ్ధి పొందేవారు. ఈ తరహా మోసాలను అరికట్టేందుకే ఈ తాజా నిబంధనలను తీసుకువచ్చినట్లు అమెరికా పౌరసత్వ , వలస సేవల విభాగం స్పష్టం చేసింది. ఈ మార్పుల నేపథ్యంలో హెచ్‌-1బీ వీసా ప్రక్రియలో రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News