టీటీడీని అడుక్కోవాలా? తిరుమల దర్శనాలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల దర్శనాల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల దర్శనాల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులను అడుక్కోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. "వాళ్లకు టీటీడీ ఉంటే మనకు యాదగిరిగుట్టలో వైటీడీ ఉంది కదా" అని ఆయన అన్నారు. అంతేకాకుండా, తెలంగాణ ప్రభుత్వం ఒక పెద్ద సంస్థను ఏర్పాటు చేయబోతోందని కూడా ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ‘ప్రజాపాలనలో కొలువుల పండగ’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ప్రతిసారి దర్శనాల కోసం ఎమ్మెల్యేల లెటర్లు అడుక్కోవడం ఎందుకు? భద్రాచలంలో రాములవారు, యాదగిరిలో లక్ష్మీనరసింహా స్వామి, రామప్పలో శివాలయాలు లేవా?" అని ప్రశ్నించారు. తిరుమలకు వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణలో ఉన్న తమ రాష్ట్రంలోని ఆలయాలకు వెళ్లొచ్చు కదా అని ఆయన సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ "తిరుమల దేవస్థానం దర్శనం గురించి ఏపీ ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులను ప్రతీసారి అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ లేదా? ఎందుకు ప్రతీసారి బతిమాలుకోవడం? భద్రాచలంలో రాముడు లేడా? మనకు శివుడి ఆలయాలు ఏమైనా తక్కువ ఉన్నాయా?" అని ప్రశ్నించారు. టీటీడీ వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణలో ఉన్న ఈ ఆలయాలకు వెళ్లొచ్చని ఆయన సూచించారు.
- 10 నెలల్లో 59 వేల ఉద్యోగాలు: ఇతర రాష్ట్రాలకు సీఎం రేవంత్ సవాల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 59 వేల ఉద్యోగాలు కల్పించిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, ప్రధానమంత్రి మోదీ ముఖ్యమంత్రిగా పనిచేసిన గుజరాత్ రాష్ట్రంలో కానీ, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్లో కానీ తమ ప్రభుత్వం ఇచ్చినన్ని ఉద్యోగాలు 10 నెలల్లో ఇచ్చిన దాఖలాలు ఉంటే తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
మేము విజ్ఞతతో ఉద్యోగాలు ఇచ్చామని, తమ ప్రజాపాలనతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక ఆదర్శంగా నిలిచిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ ప్రకటన ద్వారా సీఎం రేవంత్ తమ ప్రభుత్వ పనితీరును గట్టిగా సమర్థించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ‘బిల్డ్ నౌ పోర్టల్’ను ప్రారంభించడంతో పాటు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలకు సంబంధించి 922 మందికి నియామక పత్రాలు అందజేశారు.