పీఎం కిసాన్ షాక్ : అనర్హులకు వందల కోట్లు !
దేశంలో రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకుని వచ్చిన అద్భుతమైన పధకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి.;
దేశంలో రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకుని వచ్చిన అద్భుతమైన పధకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పేరులోనే రైతులను సన్మానించుకునే విధానం ఉంది. వారిని గొప్పగా ఆదుకోవాలన్న ఆలోచన ఉంది.
ప్రతీ ఏటా ఆరు వేల రూపాయల నిధులను నేరుగా రైతుల ఖాతాలలో కేంద్రం జమ చేస్తోంది. మధ్యలో ఏ దళారీ లేకుండా ఈ పథకం నిధులు వారికే దక్కేలా చూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పధకానికి ఎనలేని ఆదరణ దక్కుతోంది.
కేంద్రం ఈ పధకాన్ని 2019లో ప్రారంభించింది. ఇప్పటికి ఆరేళ్ళుగా ఈ పధకం కింద నిధులు రైతులు అందుకుంటున్నారు. ప్రతీ నాలుగు నెలలకు రెండు వేలు వంతున ఏడాదిలో మూడు సార్లు ఈ పథకం కింద నిధులు కేంద్రం ఇస్తోంది. ఇప్పటికి అలా 19 విడతలుగా కిసాన్ నిధులు విడుదల చేసిన కేంద్రం 20వ విడతకు సన్నాహాలు చేస్తోంది.
ఇదిలా ఉంటే పేద రైతులు ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న వారు అయిన లబ్దిదారులకే ఈ పధకం ఉద్దేశించబడింది. కిసాన్ సమ్మాన్ నిధి కింద లబ్ది పొందేందుకు నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారు సంపన్నులు, అలాగే రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు, ఆదాయం పన్ను చెల్లింపుదారులు ఈ పధకానికి అనర్హులు.
కానీ పీఎం కిసాన్ నిధులను చాలా మంది అనర్హులు తీసుకుంటున్నట్లుగా కేంద్రానికి నివేదికలు అందాయి. ఈ పధకం పొందాలంటే లబ్దిదారులు ఎప్పటికపుడు ఈ కేవైసీ చేయించుకోవాలి. అలాగే వారి ఆధార్ బ్యాంక్ ఖాతాలు లింక్ అయి ఉండాలి. భూమికి సంబంధించిన రికార్డులు కరెక్ట్ గా ఉండాలి.
ఇపుడు ఈ విధానం ద్వారానే ఈ పధకం ద్వారా అనర్హులను గుర్తిస్తున్నారు. కేంద్రం అయితే అనర్హుల నుంచి డబ్బులను వసూలు చేయాలని నిర్ణయించింది. అనర్హులు ఈ పధకం కిందకు రారని వారు ఈ పధకాన్ని తాముగానే వదులుకోవాలని సూచిస్తోంది. అలా కాదు అనుకుంటే వారి నుంచి డబ్బులను వసూలు చేస్తామని అంటోంది.
ఆ విధంగా చూస్తే కనుక అనర్హుల నుంచి కేంద్రం ఇప్పటిదాకా 416 కోట్ల రూపాయల నిధులను వెనక్కి తీసుకుందని వారి నుంచి కచ్చితంగా వసూలు చేసిందని ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.
మరో వైపు చూస్తే కనుక అధిక ఆదాయం కలిగిన రైతుల నుంచి లబ్దిదారుల నుంచి తిరిగి పీఎం కిసాన్ పధకం నిధులను వసూలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. అదే సమయంలో అర్హత ఉండి ఈ పధకం పొందలేని వారు దరఖాస్తు చేసుకుంటే వారికి తక్షణం వర్తింపచేస్తామని పేర్కొంది.
కేంద్రం అనుసరిస్తున్న ఈ విధానాన్ని సంక్షేమ పధకాలను అమలు చేస్తున్న రాష్ట్రాలు కూడా అనుసరిస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఎందుకంటే అనర్హులు ఎవరైనా ఈ పధకాల ద్వారా లబ్ది పొందితే వారి నుంచి వసూలు చేయడం ద్వారా మరింతమంది అర్హులకు వాటిని అందించవచ్చు అని అంటున్నారు. అనర్హులను గుర్తించి పధకాలను కట్ చేయడం కాదు అంతవరకూ తీసుకున్న నగదు మొత్తాలని కూడా జమ చేయించేలా వ్యవస్థలు ఉంటేనే అనర్హులు ఈ వైపుగా చూడరని అంటున్నారు.