పవన్ సీఎం...ఈ కలలకు ఇంకెన్నాళ్ళు ?

ఏపీకి పవన్ సీఎం కావాలి. ఇది జనసైనికుల బలమైన కోరిక. ఎందుకంటే ఆయన వెండి తెర మీద తిరుగులేని పవర్ స్టార్.;

Update: 2025-03-21 15:30 GMT

ఏపీకి పవన్ సీఎం కావాలి. ఇది జనసైనికుల బలమైన కోరిక. ఎందుకంటే ఆయన వెండి తెర మీద తిరుగులేని పవర్ స్టార్. అక్కడ అంతా ఆయనే. ఆయన సెకండ్ హీరో కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టు అంతకంటే కాదు. ఆయన సిల్వర్ స్క్రీన్ నిండుగా నిండి అభిమానుల పంట పండించిన తెర వేలుపు. రీల్ గాడ్ కాస్తా రియల్ గాడ్ గా మారడం కొందరికే సాధ్యం.

ఆ అదృష్టం పవన్ కి ఈ తరంలో దక్కింది. పవన్ కి నటనతో సంబంధం లేకుండా ఆయన రియల్ ఇమేజ్ చూసి ఫ్యాన్స్ అయిన వారే ఎక్కువ. పవన్ ఏపీకి సీఎం కావాలని వారే బలంగా కోరుకుంటున్నారు. ఈ జనసైనికులలో కులాలు మతాలు వర్గాలు ఏమీ లేవు. అంతా ఒక్కటే స్లోగన్ వినిపిస్తారు.

వీరికి రాజకీయాలు సమీకరణలు వ్యూహాలు పొత్తులు ఎత్తులు ఇవేమీ పట్టవు. మా దేవుడు పవన్ సీఎం అయ్యారా లేరా. పవన్ కళ్యాణ్ సీఎం అని వారు గర్వంగా చెప్పుకోవాలని చూస్తారు. ఇలా పవన్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమాన గణం ఆయన రాజకీయ పార్టీ పదేళ్ళు అయినా ఓపికగా సీఎం పవన్ అని అలాగే నినదిస్తున్నారు. ఇపుడు వారి స్లోగన్స్ ని మరో పదిహేనేళ్ళు వాయిదా వేసుకోమని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పేశారు. మరి వారి పరిస్థితి, వారి ఆలోచనలు వారి భావోద్వేగాలు ఎలా ఉంటాయో అన్నది ఆలోచించాల్సిందే.

మరో వైపు చూస్తే ఏపీలో బలమైన సామాజిక వర్గం ఒకటి ఉంది. స్వాతంత్ర్యం లభించి ఎనిమిది పదులు నిండినా ఆ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి ఎవరూ ఇప్పటిదాకా కాలేకపోయారు. జనాభా తక్కువ ఉన్న వారే ఎక్కువ ఏళ్ళు పాలించారు. ఏపీలో జయాపజయాలను మార్చి రాజకీయ పార్టీల అధినేతల జాతకాన్ని తిరగరాసే పెద్ద జనాభా కలిగిన మాకు సీఎం సీటు అందని పండు అవుతోంది అన్నది వారి ఆవేదన.

అలాంటి వారు అంతా పవన్ చుట్టూ తమ ఆశలను అల్లుకుంటున్నారు. పవన్ సీఎం క్యాండిడేట్. నో డౌట్ అన్నది వారిలో ధీమా నింపుతోంది. ఉప ముఖ్యమంత్రి దాకా పవన్ వచ్చేసారు అంటే ఒక అడుగు దూరంలో ఆయన లక్ష్యానికి చేరువగా ఉన్నారని వారు లెక్క వేసుకుంటున్నారు. అయితే సీఎం పదవి అడుగు దూరం కాదు ఎన్నో యోజనాల దూరం అని పవన్ తరచూ ఇస్తున్న ప్రకటనలను చూస్తే అర్ధం అవుతోంది.

బాబు మరో 15 ఏళ్ళు సీఎం అంటే 2029, 2034 ఎన్నికల్లో కూడా ఆయనే సీఎం అన్న మాట. అంటే ఏతా వాతా తేలేది ఏంటి అంటే పవన్ సీఎం అన్న కలను జనసైనికులు కానీ బలమైన సామజిక వర్గం కానీ కనాలన్నా కూడా 2039 దాకా వేచి ఉండాల్సిందే అన్న మాట.

ఇది నిజానికి అనూహ్యమైనది. రాజకీయాల్లో ఇవాళ ఎలా ఉంటుందో రేపు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. అందువల్ల రాజకీయంగా చూస్తే మరో పదిహేనేళ్ళు అంటే సుదీర్ఘమైన కాలం. దాంతో పవన్ ప్రకటనతో జనసైనికులు కానీ బలమైన సామాజిక వర్గం కానీ పూర్తిగా నిరాశ చెందే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

నిజానికి వారు పవన్ ని ఉప ముఖ్యమంత్రిగా ఈ టెర్మ్ లో చూసుకోవడానికి సర్దుబాటు చేసుకున్నారు. 2029 నాటికి ఆయనను సీఎం గా చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారు. మరి పవన్ బోల్డ్ గా ఇచ్చిన స్టేట్మెంట్ వారికి మింగుడు పడడం లేదు. పైగా చంద్రబాబు కింద పని చేయడానికి తాను సిద్ధమని పవన్ అంటున్నారు. బాబు నుంచి ఎంతో నేర్చుకుంటాను అని ఆయన అంటున్నారు.

పవన్ కి చంద్రబాబు మీద గురి ఉండడం మంచిదే. అలాగే ఆయన నేర్చుకోవడానికి పడే ఆరాటం మంచిదే. కానీ రాజకీయాలు అన్నవి నిరంతర అభ్యాసం. పైగా ప్రజల నుంచి నేర్చుకునేదే ఎక్కువగా ఉంటుంది. ఒడిశా సీఎం గా దాదాపు పాతికేళ్ళ పాటు పాలించిన నవీన్ పట్నాయక్ కి గురువు ఎవరు ఉన్నారు, ఆయన ఎవరి వద్ద నేర్చుకున్నారు అన్న ప్రశ్నలు ఉన్నాయి.

అంతే కాదు ఆయన జనరంజకంగా పాలించారు కదా అని గుర్తు చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ రాజకీయాల గురించి పెద్దగా ఆలోచన లేకుండా పార్టీ పెట్టేసి తొమ్మిది నెలలలో సీఎం అయి ఏపీని అభివృద్ధి పధంలో నడిపించలేదా అన్న చర్చ ఉంది. ఢిల్లీని పదేళ్ళకు పైగా ఏలిన అరవింద్ కేజ్రీవాల్ కూడా సొంతంగానే అన్నీ నేర్చుకున్నారు అని గుర్తు చేస్తున్నారు.

రాజకీయాల్లో అవకాశాలు అన్నవి తీసుకోవాలని పరిస్తితులను అనుకూలం చేసుకోవాలని విశ్లేషణలు ఉన్నాయి. ఏపీ బాగు కోసం బాబుకు మద్దతు అన్నది పవన్ విధానం అయితే అది మంచిదే కానీ అభివృద్ధి అన్నది కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అని అలా దాని కోసమే జూనియర్ పార్టనర్ గా కట్టుబడి పోవడం అన్నది కూడా సబబు కాదేమో అన్నదీ ఉంది.

ఇక వైసీపీని కట్టడి చేయడాకే బాబుతో మైత్రి అంటే జనసేన మీద ఆశలు పెంచుకున్న వర్గాలు కానీ బలమైన సామాజిక వర్గం కానీ తమ ఆశలు తీరనపుడు వేరే విధంగా ఆలోచిస్తే అపుడు పొత్తులు కట్టినా సుఖం ఉంటుందా అన్న ప్రశ్నలూ ఉన్నాయి. ఏది ఏమైనా పవన్ సీఎం అన్న కలలు సాకారం కావాలీ అంటే ఇంకెన్నాళ్ళూ అన్న నిలువెత్తు ప్రశ్నకు జవాబు బహుశా ఈ రోజుకీ ఎవరి వద్దా లేదని అంటున్నారు.

Tags:    

Similar News