సెగ్మెంట్ సంగతులు: రోజాతో టీడీపీ మిలాఖత్.. !
నగరి నియోజకవర్గంలో రెండు సార్లు విజయం దక్కించుకున్న వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రోజా..;
రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు తలకోరకంగా మారుతున్నాయి. నియోజకవర్గాల్లో పార్టీల వ్యవహారం.. ఆసక్తి గా కూడా మారుతోంది. నగరి నియోజకవర్గంలో ఉప్పు-నిప్పుగా ఉన్న వైసీపీ వర్సెస్ టీడీపీ గురించి నిన్న మొన్నటి వరకు లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు పరిస్థితులు యూటర్న్ తీసుకుంటున్నాయి. నీకిది-నాకది చందంగా.. నాయకులు మిలాఖత్ అవుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. వినేందుకు కొంత ఆశ్చర్యంగా అనిపించినా.. నిజమేనని పార్టీలలోనూ చర్చ సాగుతోంది.
విషయం ఏంటి..?
నగరి నియోజకవర్గంలో రెండు సార్లు విజయం దక్కించుకున్న వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రోజా.. నిరంతరం టీడీపీపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. కీలక నాయకులను టార్గెట్ చేసుకుని ఆమె విమర్శలు గుప్పించేవారు. అయితే.. ఆ పరిస్థితి ఉన్న అనేక నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత.. నాయకులు తెరచాటుకు వెళ్లిపోయారు. గన్నవరం, గుడివాడ వంటి నియోజకవర్గాల్లో వైసీపీ స్తబ్దుగా ఉంది. కానీ, నగరిలో మాత్రం రోజా హవా ఇప్పటికీ సాగుతోంది.
ఇదే చిత్రం. దీనికి కారణం.. టీడీపీలోకి కొందరు నాయకులతో రోజా మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నారన్న చర్చ టీడీపీలోనే వినిపిస్తోంది. రోజా అధికారంలో ఉండగా.. తమిళనాడు-ఏపీ సరిహద్దు ప్రాంతంలోని వడమాలపేట మండలంలో భారీషాపింగ్ కాంప్లెక్సును నిర్మిస్తున్నారు. అయితే.. వైసీపీ హయాంలోనే ప్రారంభించినా.. ఇది నిర్మాణం పూర్తికాలేదు. ఈలోగా టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. వాస్తవానికి ఇలా రాష్ట్రంలో కొందరు వైసీపీ నాయకులు చేపట్టిన నిర్మాణాలు కూటమి సర్కారు వచ్చాక నిలిచిపోయాయి.
కానీ, రోజా చేపట్టిన నిర్మాణానికి అనుమతులు.. సహా.. పనులు కూడా నిర్విరామంగా జరిగిపోతున్నాయి. ఇక, రోజా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో క్యాంటీన్ ప్రారంభించారు. వాస్తవానికి వైసీపీ నేతలు ఒకరిద్దరు కూడా.. గతంలో తమ తమ నియోజకవర్గాల్లో క్యాంటీన్లను ప్రారంభించారు. కానీ.. అవి అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాక మూతబడ్డాయి. రోజా చేపట్టిన క్యాంటీన్ మాత్రం ఇప్పటికీ సాగుతోంది. దీనికి విరాళాలు కూడా జోరుగా అందుతున్నాయి. ఇలా.. రోజా హవా ఏమాత్రం తగ్గలేదని.. దీనికి కారణం మిలాఖత్ రాజకీయాలేనని అంటున్నారు తమ్ముళ్లు. దీనిని అధిష్టానం కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం.