డిలిమిటేషన్ పై జగన్ మార్క్ పోరాటం

జగన్ ఎపుడు ఏమి చేసినా ఆయన స్టైలే వేరు అని అంటారు. ఆయన అసెంబ్లీకి రాకుండా ఇంట్లో మీడియా మీట్ పెట్టి మరీ బడ్జెట్ గురించి మాట్లాడుతారు.;

Update: 2025-03-22 08:20 GMT

జగన్ ఎపుడు ఏమి చేసినా ఆయన స్టైలే వేరు అని అంటారు. ఆయన అసెంబ్లీకి రాకుండా ఇంట్లో మీడియా మీట్ పెట్టి మరీ బడ్జెట్ గురించి మాట్లాడుతారు. ప్రభుత్వం విధానాలను కూడా ఆ విధంగా తూర్పారా పడతారు. ఇపుడు కూడా ఆయన చెన్నైలో డీఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ డిలిమిటేషన్ మీద ఏర్పాటు చేసిన దక్షిణాది రాష్ట్రాల నేతలతో అఖిలపక్ష సమావేశానికి జగన్ హాజరు కాలేదు.

అలాగని ఆయన ఊరుకోలేదు. డిలిమిటేషన్ మీద తన పార్టీ స్టాండ్ ఇదని చెప్పారు. అదే లేఖ రూపంలో ఆయన రాసి ప్రధాని మోడీకి పంపించారు. ఆ లేఖలో ఆయన డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బందులు వస్తాయని చెప్పారు. ఎంపీ సీట్లు పెద్ద ఎత్తున తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేస్తారు. నిధులు కూడా కేంద్రం నుండి రావని అన్నారు. గత పదిహేను ఏళ్ళలో దక్షిణాది రాష్ట్రాలలో జనాభా గణనీయంగా తగ్గిందని అన్నారు. జనాభా నియంత్రణ కోసం కేంద్రం ఇచ్చిన పిలుపుని పాటించినందువల్లనే ఈ రకమైన పరిస్థితి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు.

ఈ నేపధ్యంలో జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ ని చేపడితే మాత్రం దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అన్యాయానికి గురి అవుతాయని జగన్ ప్రధానికి రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ వేదికగా తీసుకునే నిర్ణయాలు అన్ని రాష్ట్రాలకు సమానమైన అవకాశాలు కల్పించాల్సి ఉంటుందని అన్నారు. అపుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు ముఖ్య భాగస్వామ్యం ఉంటుందని ఆయన అన్నారు. దక్షిణాదిన ఎంపీ సీట్ల తగ్గింపు లేకుండా డిలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని జగన్ కోరారు. ఏ రాష్ట్రానికి కూడా ప్రాతినిధ్యం తగ్గకుండా రాబోయే ఎంపీ నియోజకవర్గాల పునర్ విభజన కసరత్తు చేపట్టాలని ఆయన సూచించారు.

ఈ విధంగా రాసిన లేఖ ప్రతిని తమిళనాడు సీఎం స్టాలిన్ కి కూడా జగన్ ఆదేశాల మేరకు ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి పంపించారు. ఇదిలా ఉంటే స్టాలిన్ మీటింగ్ కి వైసీపీ హాజరు కాలేదు. అదే సమయంలో జగన్ ప్రధానికి లేఖ రాశారు. ఆ లేఖలోని భావాలనే వైసీపీ స్టాండ్ గా పంపించారు.

అయితే జగన్ రాసిన లేఖలోని సారాంశాలను ఈ మీటింగ్ పరిశీలిస్తుందా లేకా ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు వైసీపీ కట్టుబడి మొత్తం సౌత్ స్టేట్స్ ప్రయోజనాలకు కాపాడుకోవడానికి వారితో కలసి ఉద్యమిస్తుందా అంటే చూడాల్సి ఉంది. ఏది ఏమైనా జగన్ ఈ లేఖ రాయడం ద్వారా తనదైన పొలిటికల్ న్యూట్రల్ విధానానికి ఇబ్బంది లేకుండా చూసుకున్నారని అంటున్నారు. నిజానికి వైసీపీ ఈ మీటింగ్ కి హాజరైతే బాగుండేది అన్న మాట ఉంది.

ఎందుకంటే ఈ సమావేశం రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాల ప్రయోజనాలకు ఉద్దేశించినది. ఏపీ నుంచి వైసీపీ హాజరు అయితే ఆ పొలిటికల్ లెక్క వేరేగా ఉండేది అని అంటున్నారు. జగన్ ఈ విధంగా ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారా అన్న చర్చ వస్తోంది. మొత్తానికి చూస్తే ఇది ఆరంభం. డీఎంకే నాయకత్వంలో జరిగే ఈ మీటింగ్ తరువాత జరిగే కార్యాచరణలో వైసీపీ ఎంత మేరకు పాల్గొంటుందో చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News