అట్లుంటది పవన్ పాపులారిటీ.. ఫిదా అయిన బైరెడ్డి శబరి

తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన సందడి అందరి దృష్టిని ఆకర్షించింది.;

Update: 2025-03-22 16:43 GMT

టాలీవుడ్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు భారీగా తరలి వస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఈ అభిమానం అధికారిక కార్యక్రమాల్లో కూడా కనిపించి ఇబ్బంది కలిగిస్తుంటుంది. తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన సందడి అందరి దృష్టిని ఆకర్షించింది.

అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచర్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు పొలాల్లో సేద్యపు నీటి కుంటల నిర్మాణ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.930 కోట్ల వ్యయంతో 1.55 లక్షల ఫామ్ పాండ్స్ ను నిర్మించనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి కూడా పాల్గొన్నారు. ఆమె మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కసారిగా "ఓజీ ఓజీ" అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె ఆశ్చర్యపోతూ పవన్ కళ్యాణ్ కు ఉన్న అభిమానాన్ని కొనియాడారు. "పవన్ సార్ మీ ఫ్యాన్స్ మా మాట వినరు. వారు మిమ్మల్ని చూసేందుకే ఇక్కడికి వచ్చారు" అంటూ వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాలో పవన్ కు ఉన్న ఫాలోయింగ్ అసాధారణమని ఆమె అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వెంటనే స్పందిస్తూ వారిని అభిమానులు కాదని, దేశభక్తులని పేర్కొన్నారు. అనంతరం ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించాలని సూచించారు.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రసంగించేందుకు వచ్చిన సమయంలో కూడా అభిమానులు "ఓజీ" నినాదాలతో హోరెత్తించారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పల్లెలు, రోడ్లు, దేశం బాగుండాలనేదే తన ఆలోచన అని స్పష్టం చేశారు. అభిమానుల చూపించే ప్రేమకు తన శక్తి కూడా సరిపోదని ఆయన అన్నారు. మొత్తానికి ఈ అధికారిక కార్యక్రమం పవన్ కళ్యాణ్ అభిమానుల సందడితో నిండిపోయింది.

Tags:    

Similar News