బాబు మీద కేసీఆర్ సెటైర్లు అందుకేనా ?

టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఉన్నట్టుండి ఉరమని పిడుగులా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ భారీ సెటైర్ వేశారు.;

Update: 2025-03-23 12:51 GMT

టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఉన్నట్టుండి ఉరమని పిడుగులా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ భారీ సెటైర్ వేశారు. చంద్రబాబు గెలిచి పది నెలలుగా ఏపీకి సీఎం గా పనిచేస్తున్నారు. పైగా ఆయన నాలుగవ సారి సీఎం అయ్యారు. అయితే బాబు పొత్తుల వల్లనే గెలిచారు తప్ప సొంతంగా కాదని కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు.

బాబు విషయం ఇపుడు అప్రస్తుతం, పైగా ఆయన ఏపీకి చెందిన వారు, కానీ కేసీఆర్ తలచుకుని మరీ చంద్రబాబు మీద గురి పెట్టారు అంటే రాజకీయ దిగ్గజ నేతల మాటల వెనక అర్థాలు పరమార్థాలు వేరే ఉంటాయని అంటున్నారు. ఎన్డీయేతో బాబు జట్టు కట్టి గెలిచారు అన్నది కూడా కేసీఆర్ చెప్పారు.

అంటే ఇక్కడ నోట్ దిస్ పాయింట్ గా ఎన్డీయేను పేర్కొనాలి అని అంటున్నారు. మూడు పార్టీలు కలిశాయి. బ్రహ్మాండమైన విజయాన్ని ఏపీలో నమోదు చేశాయి. అయితే ఇది ఏపీకే పరిమితం చేయాలని బీజేపీ అనుకోవడం లేదు. తెలంగాణాకి విస్తరించాలని చూస్తోంది.

తెలంగాణాలో బీజేపీ రాజకీయంగా మంచి పొజిషన్ లో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 2028 చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని అనుకుంటోంది. అందువల్లనే ఆ పాటీ ఏపీ ఫార్ములానే తెలంగాణాలో అమలు చేయాలని చూస్తోంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో ఉంది. జనసేనకి కూడా మంచి అభిమాన గణం యువత మద్దతు ఉంది. పైగా పవన్ క్రౌడ్ పుల్లర్, బాబు వ్యూహకర్త. ఈ రెండు పార్టీలను కలుపుకుని తెలంగాణాలో ఎన్డీయే కూటమి కట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ని గద్దె దించి తాను ఎక్కాలని బీజేపీ భావిస్తోంది.

తెలంగాణాలో చూస్తే కనుక టీడీపీకి లీడర్స్ లేకపోయినా క్యాడర్ ఉంది. నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ వంటి చోట్ల బలం ఉంది. ఇక ఉత్తర తెలంగాణాలో బీజేపీ బలపడుతోంది. పవన్ కి చరిష్మా ఉంది. ఇలా కూటమితో కనుక ఢీ కొడితే కాంగ్రెస్ ని ఓడించవచ్చు అని ప్లాన్ వేస్తోంది.

దీని మీద ఇటీవల కాలంలో చర్చ అయితే సాగుతోంది. ఎన్డీయే కూటమి ప్రయోగాని జీ హెచ్ ఎంసీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారని అంటున్నారు. అదే కనుక జరిగితే ఇబ్బంది పడేది బీఅర్ఎస్ అని అంటున్నారు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అన్ని వనరులకూ కొదవ లేదు. ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు వ్యూహాలకు తిరుగు ఉండదు, పవన్ అంటేనే యూత్ కి ఒక అట్రాక్షన్.

మరి ఈ కాంబోని జనాలు కనుక మెచ్చితే కనుక దెబ్బ తినేది ముందు బీఆర్ఎస్ అని అంటున్నారు. బీఆర్ఎస్ కి 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనే ఒక్క సీటు దక్కలేదు. బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకుంది. అలాగే ఇటీవల రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకుంది. అలా ఎన్నిక ఏది అయినా బీజేపీ అంతకంతకు బలపడుతోంది. బీఆర్ స్ ని చూశారు, కాంగ్రెస్ ని చూశారు, బీజేపీకి ఒక చాన్స్ ఇస్తే తప్పేంటి అన్నది జనాలు కనుక అనుకుంటే గులాబీ పార్టీకే షాక్ తగులుతుంది అన్నది కూడా ఉంది.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత ముందు జాగ్రత్తగానే చంద్రబాబు మీద కామెంట్స్ చేశారు అని అంటున్నారు. రేపటి రోజున ఎటూ బీజేపీ తో పాటు బాబు మీద కూడా విమర్శలు చేయాల్సి ఉంటుంది అన్నది గుర్తెరిగి ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. తెలంగాణా వనరులను అంతా దోచుకోవడానికి వస్తున్నారు అని చెప్పడం ద్వారా మరో మారు సెంటిమెంట్ ని రాజేయాలని చూస్తున్నట్లుగా కూడా కనిపిస్తోంది.

సొంతంగా ఒంటరిగా పోటీకి దిగుతామని కేసీఆర్ పైకి చెప్పారు కానీ ఎన్డీయే బలంగా మూడు పార్టీలతో వస్తే కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ ఒంటరిగా ఢీ కొట్టగలదా అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి చూస్తే కనుక తెలంగాణాలో ఎన్డీయే కూటమి కనుక ఎంటర్ అయితే కేసీఆర్ డైరెక్ట్ గా చంద్రబాబు మీద ఘాటైన విమర్శలు చేస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News