నేను చచ్చిపోతే.. : అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం సంచలన ఘటన చోటు చేసుకుంది.;

తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం సంచలన ఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పలు ఆర్థిక పద్దులపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్‌ను దేవుడితో పోల్చారు. ఆయన తనకు దేవుడితో సమానమని.. ఇప్పటికి మూడు సార్లు తాను ఎమ్మెల్యే అయ్యానంటే.. ఆయనే కారణమని వ్యాఖ్యానించారు.
కాని, కొందరు ఆయనను దూషిస్తున్నారని..ఇది సరికాదని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను కేసీఆర్ హయాంలో నాలుగు సంవత్సరాలు మిషన్ భగీరథ కు చైర్మన్‌గా పనిచేసినట్టు తెలిపారు. అదేవిధంగా ఐదేళ్లు మంత్రిగా కూడా పనిచేశానన్నారు. ఇంత అవకాశం తనకు కేసీఆర్ వల్లే లభించిందని అన్నారు. మూడు సార్లుగా తనను తన నియోజకవర్గం ప్రజలు గెలిపిస్తున్నారని అన్నారు. వారికి తాను చేయాల్సినం త మేరకు పనిచేశానని చెప్పారు.
ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగానికి గురైన ప్రశాంత్ రెడ్డి.. ``నేను చేయాల్సినంత చేశాను. ఈ క్షణం ఇక్కడే నేను చచ్చిపోయినా.. నాకు ఇబ్బంది లేదు. నా మృతదేహంపై జాతీయ జెండా కప్పుతారు. ఇంతకంటే నాకేం కావాలి? ఎవరికి మాత్రం ఇలా లభిస్తుంది?`` అని వ్యాఖ్యానించారు. దీంతో సభలో ఒక్కసారిగా స్తబ్దత ఏర్పడింది. అప్పటి వరకు ముచ్చట్లాడుతున్న వారు కూడా.. ప్రశాంత్ రెడ్డి వైపు తీక్షణంగా చూశారు. ఈ సమయంలో స్పీకర్ ప్రసాదరావు ఓదార్చి.. ఆయనను ఊరడించారు. అయితే.. ఇంతగా భావోద్వేగానికి ఎందుకు గురయ్యారన్నది మాత్రం తెలియాల్సి ఉంది.