షాకింగ్ ఇష్యూ... దేశంలోని కోర్టుల్లో ఇన్ని కోట్ల పెండింగ్ కేసులా?

దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పెండింగుల్లో ఉన్న కేసుల సంఖ్య షాకింగ్ గా ఉంది!;

Update: 2025-03-28 04:05 GMT
Pending Cases In India

దేశవ్యాప్తంగా జిల్లా కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకూ వివిధ న్యాయస్థానాల్లో పరిష్కారం కాని కేసులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఇవి సుప్రీంకోర్టులో వేలల్లో ఉంటే.. హైకోర్టుల్లో లక్షల్లో ఉన్నాయి. ఇక జిల్లా కోర్టుల విషయానికొస్తే వీటి సంఖ్య కోట్లలో ఉండటం గమనార్హం. దీనికి గల కారణం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో వెల్లడైంది.

అవును... దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పెండింగుల్లో ఉన్న కేసుల సంఖ్య షాకింగ్ గా ఉంది! ఇందులో భాగంగా... 2024 చివరి నాటికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సుమారు 82,000 కేసులు పెండింగ్ లో ఉండగా.. వివిధ హైకోర్టుల్లో పెండింగులో ఉన్న కేసుల సంఖ్య 62 లక్షలకు పైగా ఉంది. దీనికి కారణం తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... పలు కేసుల్లో విచారణ పూర్తి చేసేందుకు ఏళ్లు పడుగుండగా.. అందుకు కారణం న్యాయమూర్తుల కొరతేనని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలో వెల్లడైంది. ఈ సందర్భంగా 25 హైకోర్టుల్లో 1,122 మంది న్యాయమూర్తులను మంజూరు చేస్తే.. ప్రస్తుతం 750 మంది మాత్రమే ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

వాస్తవానికి.. 2018నాటికి దేశంలోని ఆయా జిల్లా కోర్టుల్లో సుమారు మూడు కోట్ల వ్యాజ్యాలు పెండింగ్ లో ఉండగా.. వాటిని పరిష్కరించడానికి న్యాయవ్యవస్థకు కనీసం 324 ఏళ్లు పడుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. అయితే... ఇప్పుడు ఆ కేసుల సంఖ్య ఐదు కోట్ల మార్కును దాటిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి!

జనాభా నిష్పత్తిలో దేశంలో అత్యల్ప సంఖ్యలో న్యాయమూర్తులు ఉండటమే దీనికి ప్రధాన కారణమని అంటున్నారు. భారతదేశంలో ప్రతీ మిలియన్ పౌరులకు 21 మంది న్యాయమూర్తులు మాత్రమే అందుబాటులో ఉండగా.. భారత లా కమిషన్ 120వ నివేదికలో.. ప్రతీ మిలియన్ జనాభాకు 50 మంది న్యాయమూర్తులు ఉండాలని సిఫార్సు చేసింది.

అయితే... అమెరికాలో ప్రతీ మిలియన్ పౌరులకు 150 మంది న్యాయమూర్తులు ఉన్నారు! ఇలా భారత్ లో జనాభాకు తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం అనేది తీర్పులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని సుప్రీంకోర్టు ఆ మధ్య వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే దేశంలోని వివిధ జైళ్లలో 77% మంది విచారణ ఖైదీలుగానే సుదీర్ఘకాలం ఉండిపోతున్నారు.

Tags:    

Similar News