బోరుగడ్డ అనిల్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
తాజాగా ఈ కేసు మరోసారి విచారణకు రాగా, హైకోర్టు బోరుగడ్డపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.;
వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్ కుమార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా దూషించిన కేసులో అరెస్టైన బోరుగడ్డ అనిల్ కుమార్ బెయిల్ రద్దు చేయడంతో పాటు, ఆయన సమాజానికి ప్రమాదకరమని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
గతంలో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు బోరుగడ్డ అనిల్‌ను అరెస్టు చేశారు. అనంతరం తన తల్లికి చెన్నైలో ఆపరేషన్ ఉందని, ఆమెకు తానే దిక్కని పేర్కొంటూ బోరుగడ్డ హైకోర్టు నుంచి బెయిల్ పొందారు. అయితే, ఆయన సమర్పించిన వైద్య ధ్రువపత్రాలు నకిలీవని పోలీసులు గుర్తించి కోర్టుకు తెలియజేశారు.
ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు, బోరుగడ్డ సమర్పించిన బెయిల్ పిటిషన్‌లోని వైద్య ధ్రువపత్రాలు నకిలీవని తేల్చింది. దీంతో ఆయనకు గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు, ఎక్కడున్నా వెంటనే వచ్చి జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఆపై బోరుగడ్డ రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోయారు.
తాజాగా ఈ కేసు మరోసారి విచారణకు రాగా, హైకోర్టు బోరుగడ్డపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమని, వీరిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఆయనపై నమోదైన నకిలీ డాక్టర్ సర్టిఫికెట్ కేసుతో సహా అన్ని కేసుల విచారణ కొనసాగుతుందని తెలిపింది.
ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 3న నమోదైన ఒక కేసులో ఆయనకు ఏప్రిల్ 4వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ నరసరావుపేటలోని రెండవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు ఒక పిటి వారెంట్ ద్వారా నరసరావుపేటకు తీసుకువచ్చారు.