సుప్రీంకోర్టుకు చేరిన 'వలపు వల'
కర్ణాటక ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాన్ని సైతం కొన్ని రోజులుగా కుదిపేస్తున్న వలపువల(హానీ ట్రాప్) వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.;
కర్ణాటక ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాన్ని సైతం కొన్ని రోజులుగా కుదిపేస్తున్న వలపువల(హానీ ట్రాప్) వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై విచారణ జరిపి.. దీని వెనుక ఎవరున్నారన్న విషయాన్ని తేల్చి శిక్షించాలని కోరుతూ.. న్యాయవాది ఒకరు అత్యవసర పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే.. ఈ పిటిషన్ పై పూర్వాపరాలు సమర్పించిన తర్వాత విచారణకు తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం మంగళ, బుధవారాల్లో సుప్రీంలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఏం జరిగింది?
కర్ణాటకలో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కొందరు న్యాయమూర్తులు, విపక్ష ఎమ్మెల్యేలకు.. ఇటీవల వరుసగా కొన్ని వీడియో కాల్స్ వచ్చాయి. వీటిలో నగ్న, అర్ధనగ్న వీడియోలతో కొందరు సంభాషించే ప్రయత్నం చేశారు. తొలుత హోసూరు ఎమ్మెల్యేకు ఇలాంటిది రాగా.. దీనిని ఆయన లైట్ తీసుకున్నారు. తర్వాత.. మంత్రులకు, ఆతర్వాత ఎమ్మెల్యేలకు కూడా ఈ ఫోన్లు వచ్చాయి. ఇవన్నీ.. ప్రభుత్వమే చేయిస్తున్నదంటూ.. విపక్ష బీజేపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
రెండు రోజుల కిందట శుక్రవారం నాటి అసెంబ్లీలో పెద్ద ఎత్తున హానీ ట్రాప్ వ్యవహారం దుమారం రేపింది. సీఎం సిద్దరామయ్య ప్రసంగిస్తున్న సమయంలోనే స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన బీజేపీ ఎమ్మెల్యేలు .. కాయితాలను చింపి ఆయనపై వేయడం.. గాలిలోకి ఎగురవేసి.. నినాదాలతో హోరెత్తించడం పెను సంచలనంగా మారింది. అప్పట్లోనే సీఎం సిద్ధరామయ్య.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామని.. వెనుక ఎలాంటి వారున్నా శిక్షించి తీరుతామని సభలో ప్రకటించారు.
అయితే.. రోజులు గడిచినా ఆదిశగా చర్యలు లేకపోవడంతో ఓ న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదిలావుంటే.. ప్రస్తుత డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్.. హస్తం ఉందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం.. ఈ విమర్శలను తోసిపుచ్చుతోంది.