బిగ్ బ్రేకింగ్: పోసానికి బెయిల్ మంజూరు... వాట్ నెక్స్ట్?
పోసాని కృష్ణమురళికి సీఐడీ కేసులో బెయిల్ లభించింది.;
పోసాని కృష్ణమురళికి సీఐడీ కేసులో బెయిల్ లభించింది. ఈ మేరకు గుంటూరు కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. అయితే... పోసానికి తాజాగా సీఐడీ కేసులో బెయిల్ రావడంతో బయటకు వచ్చే అవకాశం ఉందా.. లేక, మరోకేసులో అరెస్ట్ చేసి, రిమాండ్ కోరే అవకాశం ఉందా అనే చర్చా అప్పుడే మొదలైంది. దీంతో... వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తిగా మారింది.
అవును... చంద్రబాబు, పవన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ చిత్రాలను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారని సీఐడీ పోలీసులు పోసానిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు పోసానిపై కేసు నమోదు చేసి.. పీటీ వారెంట్ పై కర్నూలు నుంచి గుంటూరు తీసుకొచ్చారు.
వాస్తవానికి.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, లోకేష్ లతో పాటు వారి కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారని.. సినీరంగంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదులతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్స్ లో పోసాని కృష్ణమురళిపై సుమారు 17 కేసులు నమోదైన సంగతి తెలిసిందే!
అయితే... దాదాపు అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చింది, ఇకపై ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందనే చర్చ తెరపైకి వచ్చిన నేపథ్యంలో... సీఐడీ ఎంట్రీ ఇచ్చిందని చెబుతున్నారు. ఈ కేసులోనే ఈ నెల 26 వరకూ గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. ఇదే సమయంలో ఈ నెల 18న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ కస్టడీకి కూడా ఇచ్చింది!
ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసులోనూ పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో... మొత్తం 18 కేసుల్లోనూ పోసానికి బెయిల్ వచ్చిందని అంటున్నారు. ఇదే సమయంలో కొన్ని కేసుల్లో 41ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని చెబుతున్నారు.
ఇలా... పోసానిపై ఉన్న 18 కేసుల్లోనూ కొన్నింటికి బెయిల్ ఇవ్వగా.. మరికొన్నింటిలో 41ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు వెళ్లడించిన నేపథ్యంలో.. ఇకపై పోసాని బయటకు వచ్చే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు!