విజయసాయి కుమార్తె నేహారెడ్డి రియల్ ఎస్టేట్ సంస్థపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం!
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అత్యంత సమీపంలో చేపట్టిన అక్రమ నిర్మాణాల ఫోటల్ని చూసిన హైకోర్టు న్యాయమూర్తుల ధర్మాసం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.;

వైసీపీ నుంచి బయటకు వచ్చేసి.. రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయి గురించి తెలిసిందే. ఆయన కుమార్తె నేహారెడ్డికి చెందిన అవ్యాన్ రియల్టర్స్ సంస్థ కార్యకలాపాలపై ఏపీ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అత్యంత సమీపంలో చేపట్టిన అక్రమ నిర్మాణాల ఫోటల్ని చూసిన హైకోర్టు న్యాయమూర్తుల ధర్మాసం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
బీచ్ కు అత్యంత సమీపంలో నిర్మాణాలు చేపడుతుంటూ.. అధికారులు కళ్లు మూసుకుంటారా? అన్న ప్రశ్నను సంధించింది. సముద్రతీరంలోని భూగర్భంలో చేసిన కాంక్రీట్ నిర్మాణాలకు సంబంధించిన ఫోటోల్ని చూసిన ధర్మాసనం.. ఇలాంటి వాటితో పర్యావరణానికి జరిగే నష్టాన్ని అంచనా వేసేందుకు నిపుణుల టీంను పంపాలని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నిర్మాణాలకు బాధ్యులైన జీవీఎంసీ.. రెవెన్యూ అధికారులపై చర్యలకు ఆదేశిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఆలస్యం చేస్తే నష్టాన్ని అంచనా వేయటం కష్టమవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ధర్మాసనం.. తీర ప్రాంతంలో నిర్మించిన రెస్టోబార్ల విసయంలో చేపట్టిన సర్వే రిపోర్టులను తమ ఎదుట పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. భీమిలీ బీచ్ కు అత్యంత సమీపంలో నేహారెడ్డికి చెందిన కంపెనీ నిర్మాణాలు చేపట్టిన వేళ.. అధికారులు చర్యలు తీసుకోకుండా ఉన్న అంశంపై జనసేన కార్పొరేషన్ మూర్తి యాదవ్.. బీచ్ లో శాశ్వత రెస్టోబార్ల ఏర్పాటుపై నూకరాజు హైకోర్టులో వేర్వేరు వ్యాజ్యాలు వేసిన సంగతి తెలిసిందే.
దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ధర్మాసనం కంపెనీకి సంబంధించిన బాధ్యులపై క్రిమినల్ చర్యలు నమోదు చేస్తూ కేసు కట్టాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. కట్టిన నిర్మాణాల తొలగింపు.. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని నేహారెడ్డికి చెందిన కంపెనీ నుంచే వసూలు చేయాలని జీవీఎంసీ కమిషనర్ ను ఆదేశించింది. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.