'భావ ప్రకటన స్వేచ్ఛ'పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

వాక్ స్వతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.;

Update: 2025-03-28 07:10 GMT
భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఇటీవల కాలంలో భావ ప్రకటన స్వేచ్ఛపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్న వారు చేసే కామెంట్లను అధికారంలో ఉన్నవారు సహించలేకపోవడంతో పోలీసులను పంపుతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో.. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వతంత్రం పై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... వాక్ స్వతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... వాక్ స్వతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం కోర్టు విధి అని జస్టిస్ అభ్య ఎన్స్ ఓకా, ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది!

ఇదే సమయంలో... చాలా మంది వ్యక్తులు, మరొకరు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఇష్టపడకపోయినా.. ఒక వ్యక్తి అభిప్రాయాలను వ్యక్తీకరించే హక్కును గౌరవించాలని, దాన్ని రక్షించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ సందర్భంగా.. కవిత్వం, నాటకం, సినిమాలు, వ్యంగ్యం, కళతో సహా సాహిత్యం మానవుల జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తుందని ధర్మాసనం పేర్కొంది!

రెచ్చగొట్టేలా పద్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే కారణంతో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హీ పై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్.ను కొట్టివేస్తూ... వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛపై ఈ విధంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

కాగా... ఇమ్రాన్ ప్రతాప్ ‘ఎక్స్’ లో అప్ లోడ్ చేసిన 46 సెకన్ల వీడియోలో.. అతను నడుస్తున్నప్పుడు పూల వర్షం కురిపించడం, చేతులు ఊపడం, ఈ సమయంలో ఓ పాట ప్లే అవుతుండటం కనిపించింది. అయితే.. దీనిలో రెచ్చగొట్టేలా, జాతీయ ఐక్యతకు హాని కలిగించేలా, మతపరమైన భావాలను దెబ్బతీసే సాహిత్యం ఉందని ఎఫ్.ఐ.ఆర్. ఆరోపించింది!

Tags:    

Similar News