ఇంట్రస్టింగ్ వీడియో... చంద్రబాబుకు వైసీపీ మాజీ ఎమ్మెల్సీ పాదాభివందనం!
ఇంట్రస్టింగ్ వీడియో... చంద్రబాబుకు వైసీపీ మాజీ ఎమ్మెల్సీ పాదాభివందనం!;

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించి, పనులను పరిశీలించారు.. ఈ సందర్భంగా నిర్వాసితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... గోదావరి పుష్కరరాల కన్నా ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామని అన్నారు. సాంకేతిక సమస్యలు లేకుంటే.. 2027 ఏప్రిల్ నాటికే ప్రాజెక్ట్ పూర్తి చేయాలనేది తమ లక్ష్యమని తెలిపారు.
అలా కాకుండా ఏదైనా సాంకేతిక సమస్య వస్తే 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇక... ఈ పర్యటనలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ పర్యటన సందర్భంగా చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పలువురు నేతలు వచ్చారు. ఈ సమయంలో నిన్నమొన్నటివరకూ వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న జయమంగళ వెంకట రమణ.. బాబుకు పాదాభివందనం చేశారు.
అవును... పోలవరం పర్యటన సందర్భంగా చంద్రబాబుకు స్వాగతం పలికే సందర్భంలో వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జయమంగళం.. పాదాభివందనం చేశారు. ఇది రాజకీయంగా ఆసక్తిగా మారింది. కారణం... నిన్నమొన్నటి వరకూ వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన.. ఇటీవల పార్టీకి, పదవికి రాజీనామా చేసి, జనసేనలో చేరారు. అయితే... రాజకీయ అరంగేట్రం మాత్రం టీడీపీలోనే కావడం గమనార్హం.
అంటే... కైకలూరుకు చెందిన జయమంగళం 1999లో తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆయనను మొదటి నుంచీ చంద్రబాబు ప్రోత్సహిస్తూ వచ్చారని అంటారు. ఈ క్రమంలోనే పార్టీలోకి రాగానే.. పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పదవి ఇవ్వగా.. 2005లో కైకలూరు జెడ్పీటీసీగా అవకాశం కల్పించారు. అనంతరం 2009లో కైకలూరు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో జయమంగళం గెలిచారు.
ఇక రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ పొత్తు కారణంగా కైకలూరు టిక్కెట్ బీజేపీకి దక్కడంతో జయమంగళం పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరిగి 2019లో టీడీపీ ఒంటరిగా పోటీ చేయడంతో కైకలూరు టిక్కెట్ ఆయనకు దక్కింది కానీ.. ఆ ఎన్నికల్లో జయమంగళం ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలో... 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.
ఈ క్రమంలో... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. తీరా 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవ్వడంతో.. వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. అయితే.. ఆయన ఎమ్మెల్సీ రాజీనామాకు మండలి ఛైర్మన్ ఇంకా ఆమోదించలేదు! ఏది ఏమైనా... తనను క్షమించాలని కోరారో.. లేక, ఆశీర్వదించమని అడిగారో.. శిష్యుడిని మరిచిపోవద్దని విన్నవించారో తెలియదు కానీ.. బాబు పాదాలకు జయమంగళం నమస్కరించారు! ఈ విషయం రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.