మూడోసారి యోగీ సీఎం అవుతారా ?
ఉత్తరప్రదేశ్ లో 2017లో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. అది కూడా 400కి పైగా అసెంబ్లీ సీట్లు ఉన్న అసెంబ్లీలో మూడొంతుల మెజారిటీ సాధించింది.;

ఉత్తరప్రదేశ్ లో 2017లో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. అది కూడా 400కి పైగా అసెంబ్లీ సీట్లు ఉన్న అసెంబ్లీలో మూడొంతుల మెజారిటీ సాధించింది. దాంతో బీజేపీకి తిరుగులేదు అని అంతా అనుకున్నారు. ఇక యూపీ సీఎం అభ్యర్ధులుగా ఆనాడు ఎంతోమంది అతిరధ మహారధులు ఉన్నారు. కానీ బీజేపీ అధినాయకత్వం అనూహ్యంగా అప్పటికి ఎంపీగా ఉన్న యోగీ ఆదిత్యనాథ్ ని ఎంపిక చేసింది.
అలా ఆయన దేశంలో అతి పెద్ద రాష్ట్రం అయిన యూపీకి సీఎం అయ్యారు. ఆయన చూస్తే యోగి యూపీని ఎలా పాలిస్తారు అన్న డౌట్లు అందరిలో ఉన్నాయి. కానీ బుల్డోజర్ సీఎం గా యోగీ తొందరలోనే తన మార్క్ చాటుకున్నారు. అక్రమార్కుల మీద బుల్డోజర్ అంటూ ఆయన కొత్త స్టైల్ పాలిటిక్స్ కి తెర లేపారు.
తొలి అయిదేళ్ళలోనే సీఎం గా ఆయన పాతుకుని పోయారు. ఇక 2022లో జరిగిన ఎన్నికల్లో సీట్లు తగ్గినా యోగీ తన ఇమేజ్ తో యూపీలో బీజేపీని గెలిపించారు అన్న ప్రచారం అయితే సాగింది. ఈ రోజున దేశంలో చూస్తే సొంత ఇమేజ్ కలిగిన బీజేపీ ముఖ్యమంత్రులు పెద్దగా కనిపించరు. అది ఒక్క యోగీ విషయంలో మాత్రమే వేరుగా ఉంది.
ఆయన సొంతంగా పలుకుబడి కలిగిన వారుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కనుక జనంలోకి వెళ్తే పెద్ద ఎత్తున జనాలు వస్తారు. ఆయన పేరు యూపీలో మారుమోగుతూ ఉంటుంది. పాలన మీద ఆయన ముద్ర బాగా ఉంది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కానీ ఇటీవల ప్రయాగ్ రాజ్ లో జరిగిన ప్రపంచ స్థాయి అతి పెద్ద ఆధ్యాత్మిక జాతర మహా కుంభమేళా కానీ యోగీ ఖాతాలోనే క్రెడిట్లుగా పడ్డాయి. లా అండ్ ఆర్డర్ కూడా ఆయన కంట్రోల్ లో పెట్టారు. పాలన మొత్తం తన కనుసన్ననలోకి తెచ్చుకున్నారు.
ఒక విధంగా చూస్తే అటు ఆరెస్సెస్ మద్దతు తో పాటు బలమైన హిందూత్వ వాణితో యోగీ జాతీయ స్థాయిలో బీజేపీకి తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. మోడీ తప్పుకుంటే యోగీయే ఆల్టర్నేషన్ అని అంతా అనుకునే నేపథ్యం ఉంది.
ఈ క్రమంలో ఆ మధ్య ఇండియా టూడే కాంక్లేవ్ లో యోగీ భవిష్యత్తు రాజకీయాల గురించి ప్రశ్న ఎదురైనపుడు మళ్ళీ మఠానికే అని జవాబు చెప్పి సంచలనం రేపారు యూపీ సీఎం. యూపీకి 2027లో ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ అక్కడ బలంగా ఉంది. మళ్ళీ గెలవాలని అంటే యోగీ ఫేస్ తోనే వెళ్లాలి. యోగీనే సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలి.
కానీ యోగీ మాత్రం తన మఠం తన ఆధ్యాత్మికం అని అంటున్నారు. ఇదే రాజకీయ చర్చ అనుకుంటే తాజాగా ఆయన సీఎం గా ఎనిమిదేళ్ళు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఈ తరహా అభిప్రాయాలనే వెలిబుచ్చారు. యూపీలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుంది అని ఆయన ధీమాగా చెప్పారు. యూపీని మళ్ళీ పాలించేది బీజేపీ సీఎం నే అని మాత్రమే యోగీ అన్నారు.
అంతే తప్ప తానే హ్యాట్రిక్ సీఎం అని అనలేదు. దాంతోనే ఇది హాట్ డిస్కషన్ గా మారుతోంది. ఫిఫ్టీ ప్లస్ ఏజ్ లో ఉన్న యోగీ పొలిటికల్ గా యంగ్ లీడర్ అని చెప్పాలి. అత్యంత ప్రజాదరణ ఉన్న సీఎం గా ఆయన పేరు ఉంది బీజేపీ మళ్ళీ గెలిస్తే ఆయనకే కదా చాన్స్ అని అంతా అనుకుంటున్న వేళ యోగీ ఈ విధంగా అంటున్నారు అంటే ఆయనలు రాజకీయాల మీద ఆసక్తి తగ్గిందా లేక ఆయనను కాకుండా బీజేపీ పెద్దలు వేరే వారిని సీఎం గా పెట్టాలని అనుకుంటున్నారా లేక యోగి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా అన్న సందేహాలు అందరిలో కలుగుతున్నాయి.
ఏది ఏమైనా ఎవరు అవునన్నా కాదన్నా బీజేపీలో మోదీ తరువాత యోగీకే ఎక్కువ మంది సపోర్టు ఉంది. ఆయనే బీజేపీని జాతీయ స్థాయిలో లీడ్ చేయగలరని అంతా బలంగా నమ్ముతున్నారు. యోగీ తాను మఠానికే అని అన్నా ఆయనను మాత్రం కాషాయం నేతలు కానీ ఆరెస్సెస్ కానీ వదిలే సమస్య లేదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. యోగి యూపీకి మూడోసారి సీఎం అవుతారా లేదా అన్నది భవిష్యత్తు చెబుతుంది.