మయన్మార్ మృత్యుఘోష... షాకింగ్ అప్ డేట్స్ చెప్పిన ప్రభుత్వం!

మూడు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలో వెల్లడైన మృతుల సంఖ్య షాకింగ్ గా ఉంది.;

Update: 2025-03-31 19:35 GMT
మయన్మార్  మృత్యుఘోష... షాకింగ్  అప్  డేట్స్  చెప్పిన ప్రభుత్వం!

వరుస భూప్రకంపనలతో చివురుటాకులా వణికిన మయన్మార్ లో ప్రజాజీవనం ఒక్కసారిగా ఛిన్నాభిన్నమైపోయింది. కుప్పకూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొలదీ మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. మూడు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలో వెల్లడైన మృతుల సంఖ్య షాకింగ్ గా ఉంది.

అవును... మయన్మార్ లో వరుస భూకంపాలు మిగిల్చిన నష్టాలు దారుణంగా ఉనాయి. ఈ భూవిలయంలో మృతుల సంఖ్య 2,056కి పెరిగినట్లు సైనిక ప్రభుత్వం వెల్లడించింది. ఇదే సమయంలో.. 3,900 మందికిపైగా గాయపడ్డారని.. ఇంకా 270 మంది ఆచూకీ లభ్యం కాలేదని తెలిపింది. ఈ సమయంలో క్షతగాత్రులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి.

మూడు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉండగా.. ఇంకా తమవారు సజీవంగానే ఉండి ఉండోచ్చనే ఆశతో ప్రజలు శిథిలాలను తొలగిస్తున్నారు. ఆ దృశ్యాలు హృదయాలను కలిచివేస్తున్నాయి.

మరోపక్క భూకంప తీవ్రతపై మయన్మార్ ప్రభుత్వం విడుదల చేస్తున్న సమాచారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2021 నుంచి ఆ దేశంలో మీడియాపై నియంత్రణ ఉండటమే దీనికి కారణం. ఈ సమయంలో అక్కడి ప్రజలకు నీళ్లు కూడా లేక అల్లాడుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే... అక్కడి పరిస్థితులను కవర్ చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలనే జర్నలిస్టుల అభ్యర్థనను అక్కడి సైనిక ప్రభుత్వం తిరస్కరించినట్లు కథనాలు వస్తున్నాయి. అక్కడి వాస్తవ పరిస్థితి బయట ప్రపంచానికి తెలిసిపోతాయనే అక్కడి సైనిక ప్రభుత్వం జర్నలిస్టులకు అనుమతి ఇవ్వడం లేదని అంటున్నారు.

అయితే.. అటు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో మాత్రం పరిస్థితి చాలా వరకూ సాధారణ స్థితికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాని షినవత్ర ఈ విషయాలు వెల్లడించారు. ఇదే సమయంలో.. అక్కడ మృతుల సంఖ్య 20కి పెరిగింది. అక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది.

Tags:    

Similar News