వెల్లంపల్లి వెలవెల పోయేలా ఉచ్చు ?
వైసీపీ నేతల మీద వరస కేసులు పడుతున్నాయి. అందులో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు.;

వైసీపీ నేతల మీద వరస కేసులు పడుతున్నాయి. అందులో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. అయితే పది నెలల కూటమి పాలనలో ఒక్క కేసూ పెట్టించుకోని మాజీ మంత్రిగా వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన చాలా కాలంగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.
అదంతా వ్యూహాత్మకం అని అంటున్నారు వెల్లంపల్లి మామూలుగా అయితే తన నోటి ధాటితో ప్రత్యర్ధులను ఎంతకైనా అనేస్తారు. ఆయన జగన్ కేబినెట్ లో మూడేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు ఆయనకు దేవాదాయ శాఖ ఇచ్చారు. ఆ సమయంలోనే ఆలయాల మీద విధ్వంసం జరిగాయి. అంతర్వేది రధం తగలబడిపోయింది. రామ తీర్ధాలు లో రాముడి విగ్రహానికి తల నరికేశారు.
ఇలా అనేకమైనవి జరిగితే ఆయన మంత్రిగా సమర్ధంగా చేయలేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేశాయి. అయితే వెల్లంపల్లి మాత్రం చంద్రబాబు పవన్ ల మీద విమర్శల దాడి చేసేందుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు. ఆయన చాలా సందర్భాలలో హద్దులు దాటి మరీ కూటమి అగ్ర నేతల మీద తీవ్ర విమర్శలు చేశారు అని గుర్తు చేసుకుంటున్నారు.
దాంతో జనసేన టీడీపీ వర్గాలు ఆయన మీద గుర్రుగా ఉన్నాయి. చాలా మంది వైసీపీ మాజీ మంత్రుల మీద కేసులు పడుతున్న నేపథ్యంలో వెల్లంపల్లి వంతు ఎపుడు అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఆయనను వదలడం లేదని పకడ్బందీగా ఉచ్చు బిగించే కార్యక్రమం సాగుతోందని అంటున్నారు. ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో జరిగిన అవకతవకల మీద పూర్తిగా లోతుల్లోకి వెళ్ళి అన్నీ వెలికి తీసే పని మొదలైంది అని అంటున్నారు.
అంతే కాదు వివిధ దేవాలయాలకు నెయ్యి అగ్రిమెంట్లు చేసిన దాంట్లో జరిగిన అవినీతి, వెల్లంపల్లి ట్రస్ట్ పేరుతో నిర్వహించిన కార్యకలాపాల మీద కూడా ఆరా తీస్తున్నారని అంటున్నారు. మరో వైపు చూస్తే వెల్లంపల్లి 2009లో ప్రజారాజ్యం నుంచి గెలిచారు 2014లో బీజేపీ టికెట్ మీద పొత్తులతో పోటీ చేశారు. కానీ ఓటమి పాలు అయ్యారు. 2019లో వైసీపీలో చేరి మంత్రి కూడా అయ్యారు.
ఆయన తనకు ఉన్న పాత పరిచయాలతో తిరిగి బీజేపీలోకి చేరాలని చూస్తున్నారు అని ప్రచారం కూడా అప్పట్లో సాగింది. అయితే ఆయనను చేర్చుకునే ప్రసక్తి లేదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. అయితే వైసీపీ తరఫున యాక్టివిటీస్ ని తగ్గించి మరీ సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లిదే తరువాత వరస అని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. దాంతో మాజీ మంత్రి మద్దతుదారులలో కలవరం రేగుతోంది. మరి ఎపుడు రంగం సిద్ధం చేస్తారో చూడాల్సి ఉంది అని అంటున్నారు.