మాజీ హోం మంత్రి గేర్ మారుస్తారా ?
వైసీపీ హయాంలో ఇద్దరు మహిళలు హోం మంత్రులుగా పనిచేశారు. ఆ ఇద్దరూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు.;

వైసీపీ హయాంలో ఇద్దరు మహిళలు హోం మంత్రులుగా పనిచేశారు. ఆ ఇద్దరూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. తొలిసారిగా మూడేళ్ళ పాటు మేకతోటి సుచరిత పనిచేశారు జగన్ ని అన్నా అని ఆమె పిలిచేటంత సాన్నిహిత్యం ఉంది. అయినా కానీ మూడేళ్ళ తరువాత జగన్ ఆమెను పక్కన పెట్టి గోదావరి జిల్లాలకు చెందిన తానేటి వనితకు హోంమంత్రి చాన్స్ ఇచ్చారు ఇక తానేటి వనిత అలా జగన్ కేబినెట్ లో అయిదేళ్ళ మంత్రిగా పనిచేసిన పేరు తెచ్చుకున్నారు
ఆమె సైతం జగన్ కి వీర విధేయురాలిగా ఉండేవారు. ఆమెకు 2019లో గోపాలపురం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా 27బ్ వేల భారీ మెజారిటీతో గెలిచారు. అయితే కూటమి వేవ్ లో ఆమె 26 వేల పై చిలుకు ఓట్ల తేడాతో 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు ఆ తరువాత ఆమె సైలెంట్ అయ్యారు. ఆమె మీద రకరకాలైన పుకార్లు కూడా షికారు చేశాయి. ఆమె తన పూర్వాశ్రమం అయిన టీడీపీలోకి వెళ్తారు అని కూడా గాసిప్స్ వినిపించాయి. ఎందుకంటే ఆమె 2009లో తొలిసారి టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు.
దాంతో పాటు ఆమె వైసీపీలో ఉండలేకపోతున్నారు అని అనుకున్నారు. అయితే దాదాపుగా పది నెలల తరువాత ఆమె మళ్ళీ యాక్టివ్ అయ్యారని అంటున్నారు. ఆమె తాజాగా తాడేపల్లి వెళ్ళి అధినేత జగన్ తో సమావేశం అయ్యారు జగన్ కూడా ఆమెకు గోపాలపురం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. పార్టీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
ఇక వైసీపీ రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన క్రమశిక్షణా సంఘంలో మెంబర్ గా తానేటి వనితను నియమించారు. దాంతో ఈ మాజీ హోం మంత్రి తిరిగి రాజకీయంగా చురుకుగా పాల్గొంటారా అన్న చర్చ సాగుతోంది. గోదావరి జిల్లాలలో రాజకీయం వన్ సైడ్ అన్నట్లుగా ఉంది. పూర్తిగా కూటమి పట్టు బిగించింది.
జనసేన ప్లస్ టీడీపీ అంటే ఎదురులేని పరిస్థితి ఉంది. అయితే ఎస్సీ నియోజకవర్గాలలో మాత్రం వైసీపీకి పట్టు ఉంది. దాంతో గోపాలపురం లో తానేటి వనిత తండ్రి హయాం నుంచి కూడా రాజకీయంగా బలంగా ఉండడంతో ఆమె కనుక గేర్ మార్చి స్పీడ్ పెంచితే మళ్ళీ ఫ్యాన్ జోరందుకుంటుందని అంటున్నారు. ఇంతకాలం ఆమె మీద వచ్చిన విమర్శలు అన్నీ కూడా ఉత్తివే అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆమె వైసీపీని వీడిపోరని అంటున్నారు.
ఇక టీడీపీలో చేరినా సరైన గుర్తింపు దక్కదని భావిస్తున్న వారు అంతా ఏడాది కాలంలో ఏపీలో రాజకీయం మెల్లగా మారుతోందని గ్రహించే వైసీపీలో రీ యాక్టివ్ అవుతున్నారని అంటున్నారు. వైసీపీ నుంచి ఇద్దరు మహిళా మాజీ హోం మంత్రులు ఉంటే తానేటి వనిత ఇపుడు ముందుకు వచ్చారు. మరి మేకతోటి సుచరిత కూడా ఫ్యాన్ స్పీడ్ ని పెంచుతారా రాజకీయంగా ఆమె క్రియాశీలం అవుతారా అన్న చర్చ సాగుతోంది.