ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్... కందుల దుర్గేష్ సక్సెస్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు.;

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. శాఖ ఏదైనప్పటికీ పనిచేసుకుంటూ పోతే ప్రతిఫలాలు వస్తూనే ఉంటాయని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలో.. రిషికొండ బీచ్ కు తొలగిన బ్లూఫాగ్ సర్టిఫికేషన్ ను కేవలం 20 రోజుల వ్యవధిలో తిరిగి సాధించిన ఆయన.. తాజాగా కేంద్రం నుంచి ఏపీకి గుడ్ న్యూస్ తీసుకొచ్చారు.
అవును... కేంద్రం నుంచి ఏపీకి మరో గుడ్ న్యూస్ వినిపించింది. ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్ లోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేసింది. స్వదేశ్ దర్శన్ 2.0 కింద సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
ఈ సందర్భంగా స్పందించిన దుర్గేష్... ఈ నిధులతో పాటుగా మరిన్ని నిధులతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామని అన్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన దుర్గేష్... కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలోనే సూర్యలంక బీచ్ కు నిధులు విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరారు.
ఈ క్రమంలోనే... కేంద్ర ప్రభుత్వం నుంచి సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్లు విడుదల కావటం గమనార్హం. ఇలా కేంద్రం నుంచి నిధుల మంజూరుతుకు తోడు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోన్న నేపథ్యంలో.. సూర్యలంక బీచ్ కు మహర్ధశ మొదలైనట్లేనని అంటున్నారు.
కాగా... సూర్యలంక బీచ్ నే బాపట్ల బీచ్ అని కూడా పిలుస్తారు. బంగాళాఖాతం తీరంలో ఉండే ఈ బీచ్ కు వీకెండ్స్ లో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. బాపట్లకు సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ సూర్యలంక బీచ్ ఉంది. ఇక్కడ పర్యాటకుల కోసం రిసార్టులు కూడా నిర్మించారు.
ఈ నేపథ్యంలో.. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు వంద కోట్ల రూపాయలు మంజూరు అవ్వడంతో.. ఆ బీచ్ ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.