పిఠాపురం అడ్డా ఎవరిది...వర్మ సరికొత్త వ్యూహం !

పిఠాపురం జనసేన అడ్డా అని ఇటీవల కాలంలో జనసేన నేతలు సగర్వంగా ప్రకటించారు. పవన్ కి ఈ నియోజకవర్గం శాశ్వతం అన్నట్లుగానే వారి మాటలు ఉన్నాయి;

Update: 2025-03-25 07:56 GMT
SVSN Varma Pithapuram Politics

పిఠాపురం జనసేన అడ్డా అని ఇటీవల కాలంలో జనసేన నేతలు సగర్వంగా ప్రకటించారు. పవన్ కి ఈ నియోజకవర్గం శాశ్వతం అన్నట్లుగానే వారి మాటలు ఉన్నాయి. నిజానికి 2024 ఎన్నికల్లో చివరి సమయంలో పవన్ పిఠాపురాన్ని ఎంచుకున్నారు. ఒక్క చాన్సే కదా అనుకుని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే అయిన ఎస్వీఎస్ ఎన్ వర్మ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇండిపెండెంట్ గా గెలవగలిగే బలం వర్మకు ఉందని 2014 ఎన్నికలు నిరూపించాయి.

కానీ పొత్తు ధర్మం టీడీపీ అంటే విధేయత చంద్రబాబు లోకేష్ పట్ల ఉన్న అభిమానం వంటి వాటికి కట్టుబడి వర్మ జనసేన విజయానికి మనస్ఫూర్తిగా సహకరించారు అని ఆయన అనుచరులు అంటున్నారు. అయితే పిఠాపురంలో పవన్ గెలిచాక రాజకీయ లెక్కలు మారిపోయాయి. అక్కడ బలంగా ఉన్న టీడీపీకి వర్మకు కూడా ఒక్కసారిగా ప్రాధాన్యత తగ్గిపోయింది. ఆఖరుకు వర్మ ఖర్మ అన్నట్లుగా ప్రాసలు సైతం జోడిస్తూ సెటైర్లు వేసే సీన్ కి వచ్చారు.

దాంతో వర్మ నుంచి గట్టిగానే రియాక్షన్ వస్తోంది. ఆయన తాను చంద్రబాబుని లోకేష్ బాబుని నమ్ముకున్నానని అంటున్నారు. ఈ ఇద్దరూ ఎక్కడా తనకు అన్యాయం చేయరని నమ్మకం ఉందని కూడా చెబుతున్నారు. అంతే కాదు పిఠాపురం అడ్డా అన్న మాటలకు ఆయన కౌంటర్లు ఇస్తున్నారు. తాను పిఠాపురంలో పుట్టానని ఇక్కడే పెరిగాను అని ఇక్కడే తన జీవితం మొత్తం ఉందని ఆయన జనాలకు వివరిస్తున్నట్లుగా ఎవరికి కౌంటర్ తగలాలో వారికే తగిలేలా జవాబు ఇస్తున్నారు

ఇక వర్మ అయితే ఎక్కడా తగ్గేది లేదు అనే చెబుతున్నారు. పొత్తులో భాగంగా సీటుని వదులుకున్న వర్మ తనకు ఏ రకమైన పదవి ఈ ఏడాది కాలంలో దక్కకపోవడంతో ఒకింత అసంతృప్తి చెందినా కూడా జనంలోనే ఏదైనా అన్నట్లుగా తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఆ విధంగా పిఠాపురంలో తన పలుకుబడిని కాపాడుకోవడమే కాకుండా తానేంటో మరోసారి కళ్ళకు కట్టినట్లుగా రుజువు చేయబోతున్నారు.

కార్యకర్తే అధినేత పేరుతో జనంలోకి వస్తున్నాను అని ఆయన తాజాగా చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. తాను ఈ నినాదంతో ప్రజల్లోకి తిరుగుతాను అని వర్మ స్పష్టం చేశారు. ఇక వర్మ ఇపుడు జనంలోకి వచ్చేశారు. ఆయన ప్రజలలో కలియతిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

ఆయన మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు అన్ని విషయాల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. దాంతో జనంలోకి సులువుగానే వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఉప్పాడ గ్రామంలో పర్యటించారు. అక్కడ మత్స్యకార గ్రామాలలో ఆయన తిరిగారు. వారికి ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తామని హామీ సైతం ఇచ్చారు.

మరో వైపు చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన అధికారికంగా హామీలు ఇవ్వాల్సి ఉంది. కామీ మాజీ ఎమ్మెల్యేగా వర్మ హామీలు ఇస్తున్నారు. ఒక విధంగా చూస్తే తాను ఒక అధికారిక కేంద్రంగా మారుతున్నారని అంటున్నారు.

దీని వల్ల టీడీపీ క్యాడర్ కి జోష్ తేవడమే కాకుండా జనంలో తాను తన పలుకుబడి ఎక్కడా తగ్గిపోలేదని చెప్పుకునే వ్యూహం ఇదని అంటున్నారు. మరి జనసేన వర్మ దూకుడుని చూస్తూ ఊరుకుంటుందా అన్నది ఒక ప్రశ్న అయితే వర్మ ఈ విధంగా ఒక ప్రోగ్రాం ని తన సొంత నియోజకవర్గంలో లాంచ్ చేసి పర్యటిస్తూంటే టీడీపీ పెద్దలు ఎలా రియాక్టు అవుతారు అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. ఏది ఏమైనా తాను మడి కట్టుకుని కూర్చునేది లేదని వర్మ స్పష్టం చేస్తున్నారు. పిఠాపురం వర్మ తాజా నిర్ణయంతో పొలిటికల్ గా చూస్తే జనసేనకు టీడీపీకి మధ్య పీట ముడి గట్టిగానే పడినట్లుంది అని అంటున్నారు.

Tags:    

Similar News