హీటెక్కిన ‘రాప్తాడు’.. పరిటాల ఫ్యామిలీపై తోపుదుర్తి ఫైర్

పరిటాల కుటుంబం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆయన గురువారం జరిగిన పరిణామాలను ఉటంకిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.;

Update: 2025-03-28 06:38 GMT
హీటెక్కిన ‘రాప్తాడు’.. పరిటాల ఫ్యామిలీపై తోపుదుర్తి ఫైర్

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి రామగిరి ఎంపిపి ఎన్నికల సందర్భంగా పరిటాల కుటుంబం అనుసరించిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పరిటాల కుటుంబం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆయన గురువారం జరిగిన పరిణామాలను ఉటంకిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.., రామగిరి ఎంపిపి స్థానం మహిళలకు రిజర్వ్ అయింది. మొత్తం 9 మంది ఎంపిటిసి సభ్యుల్లో 8 మంది వైసిపికి చెందినవారు ఉన్నారు. టిడిపికి కనీసం పోటీ చేయడానికి మహిళా ఎంపిటిసి సభ్యురాలు కూడా లేరు. అయినప్పటికీ, పరిటాల కుటుంబం దాదాపు వెయ్యి మంది గూండాలను ఎంపిడిఓ కార్యాలయం చుట్టూ మోహరించిందని ఆయన ఆరోపించారు.

ఎస్పీ, డీఎస్పీ శాంతిభద్రతలను నియంత్రించడానికి ప్రయత్నించినప్పటికీ, స్థానిక ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్ టిడిపి గూండాలను వెంటబెట్టుకుని అరాచకాలు సృష్టించారని ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. వైసిపికి చెందిన ఎంపిటిసి సభ్యులను బెదిరించారని, వారిని బలవంతంగా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ఆయన తెలిపారు. చివరకు పేరూరు-2కు చెందిన వైసిపి ఎంపిటిసి సభ్యురాలు భారతిని బలవంతంగా ఎత్తుకెళ్లారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కోరం లేకపోవడంతో ఎన్నికల సమావేశం వాయిదా పడింది. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసు బందోబస్తుతో తమ సభ్యులను తీసుకెళ్తున్నప్పటికీ, సమావేశం వాయిదా పడిందని తెలిసినా వారిని తమకు అప్పగించలేదని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. పెనుకొండ ఎంఆర్‌ఓ కార్యాలయం వద్దకు తీసుకెళ్లి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలంటూ ఒక నాటకం ఆడారని ఆయన దుయ్యబట్టారు. దాదాపు రెండు గంటలపాటు తమ సభ్యులను అక్కడక్కడా తిప్పుతూ సమయం వృథా చేశారని ఆయన ఆరోపించారు.

టిడిపి గూండాలు, రౌడీషీటర్లతో కలిసి ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్ అక్కడికి వచ్చి తమ సభ్యులను బెదిరించారని ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. "మీరెందుకు వైసిపికి ఓటేస్తున్నారు? మీకు బుద్ధి లేదా? మా వెంట రావాలి" అంటూ వారిని బెదిరించారని ఆయన ఆరోపించారు.

ఈ ఘటనను సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తోందని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో పరిటాల కుటుంబం తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందని ఆయన హెచ్చరించారు. "పరిటాల గుండాల్లారా ఖబడ్డార్. మీ అంతు తేల్చేదాకా వదిలిపెట్టను. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్ ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారు" అని ఆయన స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయం చేయడం చేతగాక, పరిటాల కుటుంబం తమ పాత అలవాట్లను కొనసాగిస్తోందని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. రాప్తాడు నియోజకవర్గంలో వారు చేయని దోపిడీ, అక్రమాలు లేవని, పోలీసులు వారి అక్రమాలను అడ్డుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్ వారికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

మొత్తానికి రామగిరి ఎంపిపి ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలు స్థానిక రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. వైసిపి నాయకులు పరిటాల కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేస్తుండటంతో, రానున్న రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News