పిఠాపురంలో వర్మను పోటీ చేయమంటున్న ఓటర్లు.. ఇంట్రస్టింగ్ వీడియో!

ఏపీ రాజకీయాల్లో.. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత హాట్ టాపిక్ గా నిలిచిన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటనే సంగతి తెలిసిందే;

Update: 2025-03-28 06:17 GMT
S.V.S.N. Varmas Future in Question

ఏపీ రాజకీయాల్లో.. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత హాట్ టాపిక్ గా నిలిచిన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటనే సంగతి తెలిసిందే. ఇక్కడ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ ఉండగా.. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. ఈ క్రమంలో అక్కడ నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేసి విజయం సాధించారు.

ఇప్పుడు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్.. ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాడు ఆ సమయంలో... ఎమ్మెల్యే టిక్కెట్ పవన్ కోసం త్యాగం చేసినందుకు.. వర్మను ఎమ్మెల్సీ చేసి, మండలికి పంపుతానని.. తనకు అవకాశం ఉంటే.. ఇంకా ఎక్కువ చేయాలని ఉందని చంద్రబాబు చెప్పిన పరిస్థితి! అయితే.. ఇటీవల ఎమ్మెల్సీగా వర్మకు అవకాశం దక్కలేదు.

మరోపక్క... ఇటీవల పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలో.. పవన్ కల్యాణ్ గెలుపులో ఎవరైనా తన పాత్ర ఉందని భావిస్తే అది వాళ్ల "ఖర్మ" అని నాగబాబు వ్యాఖ్యానించడంతో.. ఆ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. ఈ సమయంలో పిఠాపురంలో రాజకీయ వాతావరణం వేడేక్కిందనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి.

ఇందులో భాగంగా... ఎమ్మెల్సీ దక్కకపోవడంపైనా, ఇటీవల నాగబాబు చేసిన వ్యాఖ్యలపైనా వర్మ అభిమానులు కాస్త అసహనంగా ఉన్నారనే చర్చలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వీడియో తెరపైకి వచ్చింది. ఈ వీడియోలో పిఠాపురంలోని స్థానిక మహిళ ఒకరు... వచ్చే ఎన్నికలో పోటీ చేయమని వర్మను కోరుతున్నారు.

అవును... వచ్చే ఎన్నికల్లో మీరైనా నిలబడండి.. అని ఆ మహిళ వర్మను కోరారు. ఈ సమయంలో "నిలబడతాను" అని ఆమెతో వర్మ నవ్వుతూ సమాధానం చెప్పారు. అనంతరం... జగ్గయ్య చెరువు బాగుపడటం లేదు అని సదరు మహిళ చెప్పగా.. అభివాదం చేసుకుంటూ వర్మ ముందుకు కదిలారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట దర్శనమిచ్చింది.

దీంతో... ఈ వీడియోపై ఆసక్తికర చర్చ మొదలైంది. "పిఠాపురంలో వచ్చే ఎన్నికల్లో వర్మ నీ నిల్చోమంటున్న పిఠాపురం ఓటర్లు" అనే క్యాప్షన్ తో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. అయితే... ఈ వీడియోను వైసీపీకి సంబంధించిన 'ఎక్స్' అకౌంట్ లో పోస్ట్ చేయడం గమనార్హం!

కాగా... గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసి సుమారు 65% ఓట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... సమీప వైసీపీ అభ్యర్థి వంగ గీతపై 70,279 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

Tags:    

Similar News