మార్చి మంత్ నాగబాబుకు ఏమిచ్చింది ?
అయిదు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయితే అందులో జనసేన కోటాలో నాగబాబుకు ఎమ్మెల్సీ చాన్స్ దక్కింది.;

మెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు మార్చి నెల ఏ విధంగా జరిగింది అంటే ఒక మోదం ఒక ఖేదం అన్నట్లుగా అంటున్నారు. మార్చి నెల నాగబాబుని ఏకంగా పెద్ద మనిషిగా చేసింది. ఆయనను ఎమ్మెల్సీగా చేసింది. అయిదు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయితే అందులో జనసేన కోటాలో నాగబాబుకు ఎమ్మెల్సీ చాన్స్ దక్కింది.
ఇది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఎలాంటి ఆయాసం లేకుండా ఆరేళ్ళ పాటు హాయిగా పెద్దల సభలో మెంబర్ గా ఉండొచ్చు ఎన్నికలు హడావుడి ఏమీ అవసరం లేదు. ఆరేళ్ల పదవి అయితే గ్యారంటీ. ఆ విధంగా చూస్తే నాగబాబు వెరీ లక్ అని చెప్పాలి. నాగబాబుకి ఈ పదవి దక్కడం వెనక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలుకుబడి ఉంది. ఎందుకంటే నిజంగా ఎన్నికలు జరిగితే కనుక ఒక్కో ఎమ్మెల్సీ పదవికి 35 ఓట్లు ఉండాలి. జనసేనకు 21 మంది మాత్రమే మద్దతు ఉంది.
ఆ మిగిలిన 14 మంది టీడీపీ వారి మద్దతు ఉండాల్సిందే. అలా చూసుకుంటే టీడీపీ సానుకూలంగా స్పందించింది అని చెప్పుకోవాలి. మిత్రపక్షంగా జనసేనకు తగిన మర్యాద గౌరవం ఇవ్వడం అన్నది ఈ విషయం ద్వారానే స్పష్టం చేసింది. ఇక ఎమ్మెల్సీ అన్నది పూర్తి అయింది. నాగబాబు ఒక కీలకమైన చట్ట సభలో సభ్యుడు అయ్యారు. అది అక్షరాలా మోదమే.
కానీ అదే సమయంలో నాగబాబు మంత్రి మాత్రం కాలేకపోయారు. మార్చి నెల ముగిసింది కానీ నాగబాబుకు అమాత్య యోగం పట్టలేదు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఉగాదికి నాగబాబు మంత్రి అయి ఉండాల్సింది అని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. నిజానికి నాగబాబు ఎమ్మెల్సీ అయిందే మంత్రి పదవి కోసం అని అనుకున్నారు అంతా.
దీని కంటే ముందు ఒక బలమైన ప్రామిస్ కూడా అయనకు ఉంది. డిసెంబర్ 9న ఒక ట్వీట్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు దానిని. నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లుగా అందులో ప్రకటించారు. దాని మేరకు నాగబాబు ఎమ్మెల్సీ అయితే చాలు మినిస్టర్ అవడం ఎంతసేపు అని అనుకున్నారు అంతా.
కానీ జరిగింది వేరుగా ఉంది. ఎమ్మెల్సీ సులువుగానే అయిపోయారు. కానీ మంత్రి పదవి మాత్రం ఎపుడు అన్నది తెలియడం లేదని అంటున్నారు. నాగబాబు పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో చేసిన కొన్ని కామెంట్స్ వల్లనే ఆయనకు పదవి దక్కడం ఆలస్యం అవుతోంది అని అంటున్నారు.
అదే సమయంలో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే చాలా మంది టీడీపీలో ఆశావహులు కూడా సిద్ధం అవుతారని అది పెద్ద తలకాయ నొప్పి అవుతుందని భావించే ఉగాది వేళను తప్పించారని అంటున్నారు. మంచి ముహూర్తం అయితే దాటిపోయింది మార్చి నెలలో మంత్రి పదవి అనుకుంటే వెళ్ళిపోయింది. మళ్ళీ ఎపుడు అన్నది కనుక ఆలోచిస్తే ఇప్పట్లో అయితే జవాబు లేదు అని అంటున్నారు.
ఇక నాగబాబుని పార్టీ పనుల కోసం వినియోగించుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆయనకు ఎటూ ఎమ్మెల్సీ హోదా ఉంది. అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. దాంతో ఆయన ద్వారా పార్టీని రాష్ట్రంలో పటిష్టం చేసే కార్యక్రమాలను మరింత జోరుగా చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఉగాది వేళ విజయవాడలో రాజ్ భవన్ లో మంత్రిగా ప్రమాణం చేయాల్సిన నాగబాబు హైదరాబాద్ లో తన సోదరుడు మెగాస్టార్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం లో కనిపించారు. సో మంత్రి యోగం ఎపుడు వస్తుందో ఆయనకు చూడాల్సి ఉంది మరి.