ఎవరీ ప్రసన్న శంకర్ నారాయణ? ఆయన వైవాహిక జీవితంపై ఎందుకీ చర్చ?

సామాన్య కుటుంబంలో పుట్టి, తనదైన వ్యాపార సామర్థ్యంతో లక్షల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించిన ప్రసన్న శంకర్ నారాయణ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.;

Update: 2025-03-25 07:51 GMT
ఎవరీ ప్రసన్న శంకర్ నారాయణ? ఆయన వైవాహిక జీవితంపై ఎందుకీ చర్చ?

సామాన్య కుటుంబంలో పుట్టి, తనదైన వ్యాపార సామర్థ్యంతో లక్షల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించిన ప్రసన్న శంకర్ నారాయణ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. హెచ్‌ఆర్ టెక్ స్టార్టప్ అయిన రిప్లింగ్‌కు సహ వ్యవస్థాపకుడిగా, సింగపూర్ కేంద్రంగా పనిచేసే క్రిప్టో సోషల్ నెట్‌వర్క్ OxPPL.com వ్యవస్థాపకుడిగా ఆయన వ్యాపార వర్గాల్లో సుపరిచితులు. అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ప్రసన్న, చెన్నైలోని ఒక సాధారణ కుటుంబం నుండి ఎదిగి అమెరికాలో స్థిరపడ్డారు. ఎన్నో కోట్లు సంపాదించినప్పటికీ నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్న ఆయన వ్యక్తిగత జీవితం ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

-ప్రసన్న శంకర్ నారాయణ ఆరోపణలివీ..

ప్రసన్న శంకర్ నారాయణ, దివ్య అనే మహిళను వివాహం చేసుకున్నారు. వారికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకుల వరకు పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రసన్న తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. తన భార్య దివ్యకు వివాహేతర సంబంధం ఉందని, దీనిపై పలుమార్లు గొడవలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఎన్నిసార్లు చెప్పినా ఆమె ప్రవర్తన మార్చుకోకపోవడంతోనే విడాకులు తీసుకోవాల్సి వస్తోందని ఆయన స్పష్టం చేశారు.

- ప్రసన్న శంకర్ నారాయణ భార్య దివ్య వాదన ఇదీ..

మరోవైపు ప్రసన్న శంకర్ నారాయణ తనను వేధిస్తున్నారని దివ్య ఆరోపించారు. ఆయన స్త్రీ లోలుడని, రహస్యంగా మహిళల వీడియోలు తీస్తాడని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా తన పేరు మీద ఉన్న ఆస్తులన్నింటినీ తన పేరుకు బదిలీ చేయించుకున్నారని కూడా ఆమె ఆరోపించారు. అయితే దివ్య ఫిర్యాదు మేరకు సింగపూర్ పోలీసులు విచారణ జరిపారు. దివ్య ఆరోపించినట్లుగా ప్రసన్న ఎలాంటి ఆస్తులను తన పేరు మీదకు బదిలీ చేసుకోలేదని పోలీసులు తేల్చారు.

ఈ సమయంలో దివ్య చెన్నైకి వచ్చి తన కుమారుడిని ప్రసన్న శంకర్ నారాయణ అపహరించాడని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి స్పందించిన ప్రసన్న, తన కుమారుడు తనతో సంతోషంగా ఉన్నాడని తెలియజేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా, దివ్య తనపై ఫిర్యాదు చేసినప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా ఉండేందుకు చెన్నై పోలీసులు తనను రూ. 25 లక్షలు డిమాండ్ చేశారని ప్రసన్న ఆరోపించారు. తనకు అమెరికా, సింగపూర్ కోర్టులు ఇచ్చిన క్లీన్ చిట్ కాపీలు, తీర్పుల కాపీలను కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వ్యవహారం చెన్నై పోలీసులను ఇరకాటంలోకి నెట్టింది. ప్రముఖ వ్యాపారవేత్త కావడంతో తమిళనాడు పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు.

-సోషల్ మీడియాలో సంచలనం:

ఇటీవల భార్యల వేధింపుల కారణంగా బెంగళూరులో ఒక ఐటీ ఉద్యోగి, ఢిల్లీలో మరొక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో #mentoo ఉద్యమం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ప్రసన్న శంకర్ నారాయణ ఉదంతం మరింత చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్‌లో #justiceforprasannaShankarNarayana అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. వేలాది మంది ఈ హ్యాష్‌ట్యాగ్‌తో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

మొత్తానికి ఒక సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిన ప్రసన్న శంకర్ నారాయణ వ్యక్తిగత జీవితంలోని వివాదాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News