షాకింగ్ అప్ డేట్: ఒక్క సిరంజి.. 9 మంది జీవితాలకు షాకిచ్చింది!
ఒక సిరంజితో 10 మందికి హెచ్.ఐ.వీ. పాజిటివ్ వచ్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.;

ఒక సిరంజితో 10 మందికి హెచ్.ఐ.వీ. పాజిటివ్ వచ్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలోని వాలంచేరి మున్సిపాలిటీ ప్రాంతంలో జరిగింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్థారించారు. ఇలా హెచ్.ఐ.వీ.సోకిన వారు డ్రగ్స్ తీసుకునేవారని అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు.
అవును... ఒకేసారి 10 మందికి హెచ్.ఐ.వీ. పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయం కేరళలో వెలుగు చూసింది. ఆ పది మంది వ్యక్తులూ ఒకే సూదితో ఇంజెక్షన్ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పదిమందిలో ఏడుగురు కేరళ వాసులు కాగా.. మరో ముగ్గురు వివిధ రాష్ట్రాలకు చెందినవారని వైద్యారోగ్య శాఖ దర్యాప్తులో వెల్లడైంది.
ఈ నేపథ్యంలో అధికారులు ప్రాథమిక దర్యాప్తు నిర్వహించిన అనంతరం.. ఈ హెచ్.ఐ.వీ. సోకిన వారంతా డ్రగ్స్ కు బానిసలయ్యారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. వాస్తవానికి ఈ 10మందిలో ఒకరికి ఎయిడ్స్ సోకగా.. అతడు ఉపయోగించిన సిరంజిని మరో 9 మంది డ్రగ్స్ తీసుకునేందుకు ఉపయోగించారని, అందుకే వారికీ సోకిందని అధికారులు వెల్లడించారు.
ఇలా ఎయిడ్స్ సోకినవారిలో ముగ్గురు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులని ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. మరోపక్క హెచ్.ఐ.వీ. పాజిటివ్ వచ్చిన 10 మందినీ కేరళ వైద్య శాఖ అధికారులు తమ పర్యవేక్షణలో ఉంచారు. ఇదే సమయంలో.. అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన మలప్పురం జిల్లా వైద్యాధికారి కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా.. డ్రగ్స్ తీసుకునేవారిలో హెచ్.ఐ.వీ. సంక్రమణ పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఇదే సమయంలో... హెచ్.ఐ.వీ. సోకిన 10 మంది డ్రగ్స్ కు బానిసలవ్వడంతో.. వారి కుటుంబ సభ్యులకు కూడా ఇది వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అన్నారు.