2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు : మంత్రి లోకేష్ దిశానిర్దేశం

రాష్ట్రంలో రానున్న 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.;

Update: 2025-03-25 08:59 GMT
2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు : మంత్రి లోకేష్ దిశానిర్దేశం

రాష్ట్రంలో రానున్న 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం రెండవ సమావేశంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Nara Lokeshs Vision for 20 Lakh Jobs


సమావేశంలో భాగంగా అధికారులు ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన పురోగతి, అలాగే వివిధ ఒప్పందాల (ఎంవోయూ) స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇప్పటివరకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా దాదాపు రూ.8,73,220 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని, దీని ద్వారా సుమారు 5,27,824 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు తెలిపారు.

మంత్రుల ఉపసంఘం ఛైర్మన్ హోదాలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా సమర్థవంతమైన పెట్టుబడుల ట్రాకింగ్ పోర్టల్ ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ పోర్టల్లో భూ కేటాయింపులు, అనుమతులకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.

పెట్టుబడులు పెట్టడానికి ఆటంకంగా ఉన్న విధానాలను సంస్కరిస్తామని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించే విధంగా ప్రతి విధానంలోనూ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా, జాతీయంగా ఉన్న పెద్ద కంపెనీలన్నింటినీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు మరింతగా విస్తరించేలా వారిలో విశ్వాసం నింపాలని, వారికి అందించాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలను సకాలంలో అందజేయాలని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని మంత్రి లోకేష్ తెలిపారు. వారికి అవసరమైన భూ కేటాయింపులతో పాటు అనుమతులు, రాయితీలను త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎమ్ఈ) రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని గుర్తించిన ప్రభుత్వం, వాటిని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని ఆయన వెల్లడించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలల ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.

రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి లోకేష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా, మైనింగ్ రంగంలో కూడా విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, ఈ రంగంపైనా దృష్టి సారించాలని ఆయన సూచించారు.

ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ, ఎంఎస్ఎమ్ఈ మరియు సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఉన్నతాధికారులు అజయ్ జైన్, ఎన్.యువరాజ్, కాటమనేని భాస్కర్, ప్రవీణ్ కుమార్, సాయికాంత్ వర్మ, ఎమ్. అభిషిక్త్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News