తెలంగాణ కేబినెట్ పునర్వ్యస్థీకరణ: కొత్త మంత్రుల సందడి

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.;

Update: 2025-03-25 10:01 GMT

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అంతటా ఒకటే చర్చ.. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది నెలలకే మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయనే వార్తలు జోరందుకున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అధిష్టానం నుంచి ఇద్దరు బీసీలు, రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్టు సమాచారం. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలోనే నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే జీ వివేక్ వెంకటస్వామి సహా మరో ఇద్దరికి ఈసారి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం. ఈ వార్తలు బయటకు రావడంతోనే వారి అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. వారికి ముందస్తు శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

శాసనసభ సమావేశాల్లోనూ ఈ సందడి స్పష్టంగా కనిపిస్తోంది. పదవి చేపట్టకముందే పలువురు ఎమ్మెల్యేలు వీరిని ‘మంత్రి గారు’ అంటూ సంబోధిస్తుండటం విశేషం. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది.

- హోం మంత్రి పదవిపై కోమటిరెడ్డి మనసులోని మాట!

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టారు. తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా తనకు హోం మంత్రి పదవి అంటే ప్రత్యేకమైన ఇష్టమని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నాకు మంత్రి వస్తుందని ఆశిస్తున్నా. మంత్రుల ఎంపిక వారి సామర్థ్యాన్ని బట్టి ఉండాలి. గతంలో భువనగిరి ఎంపీగా నా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాను. నాకు హోం మంత్రి అంటే చాలా ఇష్టం. అయితే, ఏ పదవి ఇచ్చినా సరే ప్రజల పక్షాన నిలబడి సమర్థవంతంగా పనిచేస్తాను. ఇప్పటివరకు ఢిల్లీ నుంచి నాకు ఎలాంటి ఫోన్ రాలేదు" అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు ఆయన అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.

- మాజీ మంత్రి మల్లన్న పలకరింపు.. మంత్రి వివేక్‌కు ఖాయమైనట్టేనా?

మరోవైపు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరగనుందనే వార్తల నేపథ్యంలో అసెంబ్లీ లాబీలో జరిగిన ఒక ఆసక్తికర సంభాషణ అందరి దృష్టిని ఆకర్షించింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి.. వివేక్‌ను ఉద్దేశించి "నమస్తే మంత్రి" అంటూ పలకరించారు. దీనికి వివేక్ స్పందిస్తూ "థ్యాంక్స్ మల్లన్న" అని బదులిచ్చారు. వీరి మధ్య జరిగిన ఈ సంభాషణతో వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఖాయమైపోయిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఒక సీనియర్ ఎమ్మెల్యే స్వయంగా మంత్రి అని సంబోధించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.

మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ వార్తలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హోం మంత్రి పదవిపై తనకున్న ఆసక్తిని వ్యక్తం చేయగా, వివేక్ వెంకటస్వామిని మల్లారెడ్డి మంత్రి అని సంబోధించడం ఈ పరిణామాలకు మరింత ఆజ్యం పోసింది. మరి కొద్ది గంటల్లోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అప్పటివరకు ఈ ఊహాగానాలు, సందడి కొనసాగే అవకాశం ఉంది. కొత్త మంత్రులు ఎవరెవరు కానున్నారో, వారికి ఏయే శాఖలు దక్కనున్నాయో వేచి చూడాలి.

Tags:    

Similar News