72 గంటలు, 25 మంది స్టార్లు... సెలబ్రెటీలకు కేఏ పాల్ డెడ్ లైన్!

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చినట్లు కథనాలొచ్చాయి.;

Update: 2025-03-23 12:50 GMT

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన స్టార్లకు సంబంధించిన చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లతో పాటు సెలబ్రెటీలకూ పోలీసులు వార్నింగులు ఇస్తున్నారు! ఈ సమయంలో కేఏ పాల్ వారికి డెడ్ లైన్ విధించారు.

అవును... బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చినట్లు కథనాలొచ్చాయి. ఈ సమయంలో... 72 గంటలు సమయం ఇస్తున్న.. చేసిన తప్పు ఒప్పుకోండి అని సెలబ్రెటీలకు ప్రజాశాంతిపార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

వాస్తవానికి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్, రానా, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్ సహా పలువురు సినీ, టీవీ ఆర్టిస్ట్లు.. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు సహా పలువురిపై కేసు నమోదైనట్లు చెబుతున్నారు! వీరిలో చాలా మంది ఇప్పటికే పోలీసు విచారణకు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు కేఏ పాల్. ఈ సందర్భంగా... బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన ప్రముఖులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆన్ లైన్ స్కిల్ గేమ్స్ పేరుతో బెట్టింగ్ యాప్స్ ను, వాటర్ బాటిల్ పేరుతో మందును, ఇలాచీ పేరుతో టొబాకోను పలువురు సెలబ్రెటీల ముసుగులో ప్రమోట్ చేస్తున్నారని అన్నారు!

ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ లాంటి సుమారు పాతిక మంది ప్రముఖులు త్వరలో అరెస్ట్ కాబోతున్నారంటూ పాల్ జోస్యం చెప్పారు! ఈ క్రమంలో.. పోలీసులు, రాజకీయ నాయకులు.. వారి వద్ద డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే.. వారందరినీ సుప్రీంకోర్టుకు తానే నడిపిస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు!

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా ఈ సెలబ్రెటీలంతా నరహత్యకు పాల్పడ్డారని.. వీరిని ఎంతగానో అభిమానించే వారికి మీరిచ్చే బహుమతి ఇదేనా అని ప్రశ్నించారు. ప్రకాశ్ రాజ్ లాగా తప్పయ్యిందని ఒప్పుకొని, బహిరంగంగా క్షమాపణలు చెప్పేంత వరకూ ఎవారినీ వదిలిపెట్టనని.. మీకు 72 గంటలు టైం ఇస్తున్నానని.. అందరూ బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలని పాల్ అల్టిమేటం జారీ చేశారు!

Tags:    

Similar News