వైసీపీని ఖాళీ చేస్తాం...పాత నేత కొత్త సౌండ్ !

వైసీపీని ఖాళీ చేయడమే టీడీపీ కూటమి లక్ష్యమని బీజేపీ సీనియర్ నేత రెండోసారి ఎమ్మెల్సీగా అయిన సోము వీర్రాజు బిగ్ సౌండ్ చేశారు.;

Update: 2025-03-23 12:52 GMT

వైసీపీని ఖాళీ చేయడమే టీడీపీ కూటమి లక్ష్యమని బీజేపీ సీనియర్ నేత రెండోసారి ఎమ్మెల్సీగా అయిన సోము వీర్రాజు బిగ్ సౌండ్ చేశారు. ఏపీలో అభివృద్ధికి వైసీపీ విఘాతం అని కూడా అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా సోము వీర్రాజు వైసీపీ నుంచి వచ్చి చేరిన వారికి బీజేపీ కండువాలు కప్పారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీని మళ్ళీ జనాలు ఎన్నుకోరని స్పష్టం చేశారు. అసెంబ్లీకి వెళ్ళని వారికి పదవులు ఎందుకు అని జగన్ మీద హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి రావాలీ అంటే ప్రతిపక్ష హోదా కావాలని జగన్ కోరుతున్నారని కానీ ఇదే జగన్ కి 2014 నుంచి 2019 మధ్యలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు ఇచ్చి జనాలు పంపించారని గుర్తు చేశారు. కానీ అపుడు ఆయన చేసిందేంటి అని సోము నిలదీశారు.

జగన్ తొలి మూడేళ్ళు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారని ఆ తరువాత ఆయన అసెంబ్లీ ముఖం చూడలేదని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చినా జగన్ చేసేది అదే అని తేల్చేశారు. ఏపీలో పాలన గాడిన పెడుతోంది కూటమి ప్రభుత్వమే అని ఆయన అన్నారు. జగన్ ఏలుబడిలో ఏపీ అన్ని రకాలుగా ఇబ్బందుల పాలు అయింది అన్నది జనాలకు బాగా తెలుసు అని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.

విశాఖను పాలనా రాజధాని అని చెప్పిన జగన్ విశాఖ అభివృద్ధికి ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. కేవలం రుషికొండ మీద అయిదు వందల కోట్ల రూపాయలతో విలాసవంతమైన భవనాన్ని ఆయన కట్టుకున్నారని నిందించారు. వైసీపీ వల్ల ఏమీ కాదని తెలిసే జనాలు ఆ పార్టీని ఓడించారని అన్నారు.

ఇక వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 20 శాతం ఓట్లు వస్తే గొప్పే అని కూడా ఆయన అన్నారు. ఈసారి వైసీపీ ఓట్లూ సీట్లూ కూడా దారుణంగా తగ్గిపోతాయని ఆయన అన్నారు. వైసీపీ అధినాయకత్వం తీరు కారణంగానే ఇలా జరుగుతోందని అన్నారు.

మొత్తం మీద చూస్తే ఏపీలో వైసీపీని లేకుండా చేస్తామని సోము వీర్రాజు ప్రకటించారు. మూడు పార్టీలే కూటమిగా ఉన్నాయని ఆ పార్టీలదే భవిష్యత్తు అని ఆయన అన్నారు. అంతే కాదు తెలుగు రాష్ట్రాలకు మరీ ముఖ్యంగా ఏపీకి ఏమి చేయాలో ప్రధాని నరేంద్ర మోడీకి బాగా తెలుసు అని ఆయన చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆదుకోవడంలో కేంద్రం ముందుకు వచ్చి అన్ని విధాలుగా కాపాడిందని ఆయన గుర్తు చేశారు.

ఇవన్నీ ఇలా ఉంటే ఎమ్మెల్సీ అయ్యాక సోము గొంతు మారిందని అంటున్నారు. ఆయన జగన్ మీద గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రంగానే విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నపుడు ఆయన జగన్ మనిషిగా ముద్ర పడ్డారన్నది టీడీపీ వారి వైపు నుంచి అనుమానంగా ఉంది. దాంతో ఈ అనుమానాలను పటాపంచలు చేసేందుకు సోము జగన్ అన్న పేరు ఎత్తితేనే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మరి దీనిని టీడీపీ తమ్ముళ్ళు నమ్ముతారా సోము నిజంగానే ఇంతటి వీరావేశంతోనే వైసీపీ మీద విరుచుకుపడుతున్నారా అంటే చూడాలి మరి.

Tags:    

Similar News