ఆక్రమించిన కశ్మీర్ ను పాక్ ఖాళీ చేయాలి.. భారత్ సంచలన డిమాండ్
అంతర్జాతీయ వేదికపై దాయాది పాకిస్థాన్ కు మరోసారి భంగపాటు తప్పలేదు.;

అంతర్జాతీయ వేదికపై దాయాది పాకిస్థాన్ కు మరోసారి భంగపాటు తప్పలేదు. తగదునమ్మా అన్నట్లుగా సమయం.. సందర్భం లేకుండా ఏదోలా కశ్మీర్ అంశాన్ని కెలకాలని ప్రయత్నించిన ఆ దేశానికి భారత్ ఘాటు ఆన్సర్ ఇవ్వటమే కాదు.. సీరియస్ వార్నింగ్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.
ఐక్యరాజ్యసమితిలో శాంతి పరిరక్షణ సంస్కరణలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పాక్ ప్రతినిధి సయ్యద్ తారిఖ్ ఫతేమీ మాట్లాడారు. చెప్పాల్సిన విషయాల్ని చెప్పేసి.. నోరు మూసుకొని ఉంటే బాగుండేది. అందుకు భిన్నంగా భారత్ గురించి చేసిన వ్యాఖ్యలు బూమ్ రాంగ్ తరహాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాక్ కు గట్టిగా తగిలింది.
తన ప్రసంగంలో భాగం జమ్మూకశ్మీర్ అంశాన్ని లెవనెత్తిన ఆయన.. భారత్ చేత ఘాటు రియాక్షన్ వచ్చేలా చేసుకున్నారు. అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్ కు.. ఐక్య రాజ్యసమితిలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ అడ్డుకున్నారు. పాకిస్థాన్ అనవసర అంశాల్ని లాగుతుందని మండిపడ్డారు.
పాకిస్థాన్ ఆక్రమించిన కశ్మీర్ ప్రాంతాలన్నీ భారత్ లో అంతర్భాగమేనని స్పష్టం చేయటంతో పాటు.. పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన కశ్మీర్ భూభాగాలను ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన ప్రతిసారీ భంగపడే పాకిస్థాన్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.