లోక్ సభలో బాహుబలి.. పుష్ప కలెక్షన్ల ప్రస్తావన ఎందుకు?
ఏపీలో గత ప్రభుత్వం చేపట్టిన మద్యం వ్యాపారానికి సంబంధించిన అంశాలపై దర్యాప్తు జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ చేశారు.;

లోక్ సభలో టీడీపీ ఎంపీ శ్రీ క్రష్ణదేవరాయలు లేవనెత్తిన అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారటమే కాదు.. సంచలనంగా మారాయి. జాతీయ స్థాయిలో అందరూ ఒక చెవి వేసేలా ఆయన ఆరోపణలు ఉన్నాయి. ఏపీలోని గత ప్రభుత్వం చేసిన మద్యం వ్యాపారంతో పోలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కాంతో నీటి బొట్టు అంతగా అభివర్ణించారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఐదేళ్లలో రూ.99వేల కోట్ల మద్యం వ్యాపారం సాగితే అందులో రూ.18వేల కోట్లు దుర్వినియోగమైనట్లుగా ఆరోపించారు.
ఏపీలో గత ప్రభుత్వం చేపట్టిన మద్యం వ్యాపారానికి సంబంధించిన అంశాలపై దర్యాప్తు జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ చేశారు. లోక్ సభలో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఏపీ లిక్కర్ వ్యాపారం గురించి చెప్పే క్రమంలో ఆయన బాహుబలి.. పుష్ప వసూళ్ల ప్రస్తావన తేవటం ఆసక్తికరంగా మారింది.
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బాహుబలి.. ఆర్ఆర్ఆర్.. పుష్ప సినిమాలు రూ.1700 కోట్ల నుంచి రూ.2వేల కోట్ల వరకు వసూళ్లు చేశాయన్న లావు శ్రీక్రష్ణదేవరాయులు.. ‘గడిచిన ఐదేళ్లలో ఏపీలో మద్యం పేరిట అంతకు మించిన వసూళ్లు జరిగాయి. ఈ స్కాం పరిణామాలు పార్లమెంటులోనూ కనిపించాయి. ఈ కారణంతోనే రాజ్యసభలో మరో నాలుగేళ్లు పదవీ కాలం ఉండగానే ఒక ఎంపీ రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. సినిమాలకు ప్రీ ప్రొడక్షన్.. డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఏపీ మద్యం స్కాం కూడా ఆ శైలిలోనే సాగింది’ అంటూచెప్పుకొచ్చారు.
గత పాలకులు ఏపీలో తాము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధాన్ని విధిస్తామని చెప్పారని.. నిషేధించలేదు సరికదా.. సాధారణ ప్రజలు తాగలేనంతగా మద్యం ధరలు పెంచారని.. చౌకధరలకు మద్యం అమ్మాలని ఒత్తిడి తెచ్చి అంతర్జాతీయ బ్రాండ్లను వెళ్లగొట్టారన్నారు. రాష్ట్రంలో 22 డిస్టలరీలను చేజిక్కించుకోవటంతో పాటు 26 కొత్త కంపెనీలను ప్రారంభించారన్నారు.
దేశంలో డిజిటల్ లావాదేవీలు గత ప్రభుత్వ హయాంలోని ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల నుంచి రూ.200 లక్షల కోట్లకు పెరిగితే.. ఏపీ మద్యం అమ్మకాల్లో మాత్రం అందుకు రివర్సులో జరిగిందన్నారు. ఇందులో దాదాపు రూ.18వేల కోట్ల దుర్వినియోగం జరిగిందన్న వాదన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజా చర్చ రానున్న రోజుల్లో మరే పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.