వ్యవస్థల లాలస.. అందుకే ఇలా?!
ఈ నెల 14న జస్టిస్ వర్మ ఇంట్లో జరిగిన స్వల్ప అగ్ని ప్రమాదం అనంతరం.. ఏడు రోజుల తర్వాత ఈ ఘ టన వెలుగు చూసింది.;
''దేశంలో ఎన్ని వ్యవస్థలు దారి తప్పినా.. ఆయా వ్యవస్థలను దారిలో పెట్టే న్యాయ వ్యవస్థ పటిష్ఠంగా ఉన్నంత వరకు దేశానికి వచ్చిన నష్టం లేదు''- ఇదీ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ చెప్పిన మాట. అయితే.. ఇప్పుడు నిప్పుకే చెదలు పట్టిన చందంగా.. భారత న్యాయవ్యవస్థపైనే మరకలు అంటు న్నాయి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ వర్మ ఇంట్లో ఉన్నట్టుగా భావిస్తున్న నోట్ల కట్టల వ్యవహారం.. దేశాన్ని, వ్యవస్థలను కూడా పెనుకుదుపునకు దారితీసింది.
ఈ నెల 14న జస్టిస్ వర్మ ఇంట్లో జరిగిన స్వల్ప అగ్ని ప్రమాదం అనంతరం.. ఏడు రోజుల తర్వాత ఈ ఘ టన వెలుగు చూసింది. అయితే.. ఇది దేశమీడియా బయట పెట్టిన విషయం కాదు. అంతర్జాతీయ మీడి యా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. అనంతరం.. మన మీడియా అందుకుంది. దీనిని బట్టి.. వ్యవస్థలు ఎంతగా మేనేజ్ అవుతున్నాయన్నది తెలుస్తూనే ఉందని.. అంతర్జాతీయ మీడియా చేసిన వ్యాఖ్య పాలకులకు వినిపించకపోయినా.. ప్రజలు విన్నారు.
సదరు జస్టిస్ వర్మ, ఆయన ఇంట్లో లభించిన నోట్ల కట్టలు.. ఈ సంగతుల వ్యవహారం.. ఎలాంటిది? ఎప్పు డు తేలుతుంది? దీనిలో ఎవరు నిందితులు..? ఎలా ఆ సొమ్ములు వచ్చాయి? అనే కీలక విషయాలు పక్క న పెడితే.. అసలు ఇలా.. వ్యవస్థల దిగజారుడు వ్యవహారం ఎప్పుడు ఎలా మొదలైందనే సంగతి ఆసక్తి కరం. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థలు.. ఏనాడో దారి మళ్లాయి. తమకు వ్యతిరేకంగా గళం వినిపించిన వారిపై ప్రయోగించే ఆయుధాలుగా.. రాజకీయ వస్తువులుగా అవిమారాయి.
ఇక, తమకు అనుకూలంగా తీర్పులు ఇచ్చిన వారికి నజరానాలు సమర్పించే సంస్కృతి కూడా పెరిగింది. ఓబులాపురం మైనింగ్ కేసులో తనకు బెయిల్ ఇప్పించేందుకు సహకరించిన ఓ న్యాయమూర్తికి గాలి జనార్దన్ రెడ్డి ముడుపులు ఇవ్వడం.. తెలిసిందే. ఈ కేసులో సదరు న్యాయమూర్తి అరెస్టయి.. జైల్లో కూడా ఉన్నారు. ఇక, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూల తీర్పు ఇచ్చిన ఐదుగురు న్యాయమూర్తులు ఇప్పుడు ఎలాంటి పదవులు అనుభవిస్తున్నారో.. జగద్వితమే!.
ఈ పరంపరే.. ఇప్పుడు నిప్పుకు సైతం చెద పట్టించే పరిస్థితిని తీసుకువచ్చింది. అందుకే.. తమ భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. పదవుల లాలసపై ముచ్చట పడుతున్న కొందరు ఇలా పెడదారి పడుతున్నారంటే.. పాపం కేంద్రంలోని పెద్దలది కాదా? అన్నది చర్చ. జస్టిస్ సదాశివం.. కేరళ గవర్నర్ అయినా.. మరో న్యాయమూర్తి.. జస్టిస్ గొగోయ్ రాజ్యసభ సభ్యుడు అయినా.. తెరవెనుక ఏమీ లేకుండానే జరిగిపోయాయా? సో.. ఈ పరిణామాలను బట్టి ఎవరి ప్రమేయం ఉందో అర్ధమవుతుంది.