ఎవర్రా నా ఫొటో ఇంత చెత్తగా గీసింది.. ట్రంప్ సీరియస్

ఎలా ఉన్నా అలానే ఉంటాం అంటారు.. ముసలోళ్లం అయిపోయినా కూడా మనకు మనమే సాటి అనుకుంటాం.;

Update: 2025-03-24 11:22 GMT
Trump Portrait at Colorado

ఎవరు ఎలా ఉన్నా కూడా...తమ సొంత అందాన్ని ఎప్పటికీ కించపరుచుకోరు. ఎలా ఉన్నా అలానే ఉంటాం అంటారు.. ముసలోళ్లం అయిపోయినా కూడా మనకు మనమే సాటి అనుకుంటాం. అయితే తమ చిత్రం విషయంలో తప్పుగా ఉంటే మాత్రం తట్టుకోలేం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అంతే.. రాష్ట్ర క్యాపిటల్ లో తన చిత్రాన్ని చూసిన ట్రంప్ కు చిర్రెత్తుకొచ్చింది. దానిపై సీరియస్ అయిపోయాడు.

అమెరికా అధ్యక్షుడు, బిజినెస్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి కారణం ఆయనకు నచ్చని ఒక చిత్రం. కొలరాడో రాష్ట్ర కాపిటల్ భవనంలో తనతో పాటు ఇతర అధ్యక్షుల చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే తన చిత్రాన్ని చూసిన ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆ చిత్రాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఆ రాష్ట్ర గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే అలా చేశారని ఆరోపించారు.

ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా తన ఆవేదనను వెళ్లగక్కారు. "ఎవరికైనా తమ చెత్త ఫోటోలు, చిత్రాలు నచ్చవు. కానీ కొలరాడోలో నా చిత్రాన్ని చూస్తే.. భవిష్యత్తులో కూడా ఇంత దారుణమైన చిత్రాన్ని చూడకూడదనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా కుట్రపూరిత చర్య!" అంటూ మండిపడ్డారు.

ఇంతటితో ఆగకుండా ఆ చిత్రకారిణిపై తన అక్కసు వెళ్లగక్కారు. "ఆమె ఒబామా చిత్రాన్ని అద్భుతంగా గీసింది. కానీ నా చిత్రం మాత్రం దారుణంగా ఉంది. బహుశా ఆమె వృద్ధురాలు కావడం వల్ల తన కళను కోల్పోయి ఉంటుంది" అని వ్యాఖ్యానించారు. ఒకవేళ తన చిత్రం అక్కడ లేకపోయినా బాధపడేవాడిని కానీ, ఇలాంటి చిత్రాన్ని మాత్రం చూడలేనని తేల్చి చెప్పారు.

ట్రంప్ అభిమానులు కూడా తమ నాయకుడికి మద్దతుగా నిలిచారు. కొలరాడో నుండి చాలా మంది ఫోన్లు చేసి ఫిర్యాదు చేస్తున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా, ట్రంప్ కొలరాడో గవర్నర్ జారెడ్ పోలిస్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. "ఆ రాడికల్ లెఫ్ట్ గవర్నర్‌కు నేరాలను అదుపు చేయడం చేతకాదు. ముఖ్యంగా మాదక ద్రవ్యాల ముఠాలను అరికట్టడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. కానీ, మేం వస్తే అన్నింటినీ చక్కదిద్దుతాం" అంటూ హామీ ఇచ్చారు.

విశేషం ఏమిటంటే, ఈ చిత్రం 2019లో ఆవిష్కరించబడింది. దీనిని సారా బోర్డ్‌మన్‌ అనే కళాకారిణి గీశారు. ఆమె గతంలో జార్జి డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా చిత్రాలను కూడా వేశారు. అయితే, ట్రంప్ మాత్రం తన చిత్రాన్ని ఎందుకు అంత దారుణంగా వేశారో అర్థం కావడం లేదంటున్నారు.

మరోవైపు ట్రంప్ శ్వేతసౌధంలో తన ఫోటోలను బంగారు ఫ్రేమ్‌లతో ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు, తన మగ్‌షాట్‌ను కూడా అక్కడ ప్రత్యేకంగా ఉంచారు. బహుశా కొలరాడో గవర్నర్ కూడా ట్రంప్ అభిరుచికి తగ్గట్టుగా బంగారు ఫ్రేమ్‌లో వేరే ఫోటోను ఏర్పాటు చేస్తే ఈ వివాదం సద్దుమణుగుతుందేమో చూడాలి!

ఏది ఏమైనా అధ్యక్షుడికి ఒక చిత్రం విషయంలో ఇంతలా కోపం రావడం మాత్రం ఆశ్చర్యకరమే. బహుశా ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థులపై చూపించే ఆగ్రహాన్ని ఇప్పుడు తన చిత్రాలపై కూడా చూపిస్తున్నారేమో!

Tags:    

Similar News